Junior Movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
తొలి సినిమా అనేసరికి హీరోగా తానేం చేయగలడు? తన సామర్థ్యం ఏమిటి? అనే విషయాలు నిరూపించుకోవాలని ప్రతీ హీరోకీ ఉంటుంది. డాన్సులు, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్.. ఇలా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభని చూపించుకొని ఆల్ రౌండర్ అనే ముద్ర వేయించుకోవాలని అనుకొంటారు. డెబ్యూ సినిమాల ధ్యేయం అదే. కథ, కథనాలు కాస్త అటూ ఇటూ అయినా ఈ విషయంలో సక్సెస్ అయితే డెబ్యూ హీరో ధ్యేయం నెరవేరినట్టే. ఇలాంటి అచ్చమైన సూత్రాలతో, లెక్కలతో తయారైన సినిమా ‘జూనియర్’. సుపరిచిత రాజకీయ వేత్త గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. మరి కిరీటి ప్రతిభేంటి? తను ఆల్ రౌండర్ అనిపించుకొన్నాడా? ‘జూనియర్’ బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ప్రభావం చూపించగలడు?
అభి (కిరీటి) ఈతరం అబ్బాయి. తండ్రి (రవిచంద్రన్) మాత్రం పాత కాలపు మనిషి. ఇద్దరి మధ్యా జనరేషన్ గ్యాప్. లేటు వయసులో పుట్టిన బిడ్డ కాబట్టి మరింత గారాబం. ఆ అతి ప్రేమని అభి భరించలేక పారిపోతూ ఉంటాడు. తన కాలేజీలో స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. తన కోసమే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఉద్యోగంలో చేరిన తొలి రోజే ఆ కంపెనీ యజమాని కూతురు, కాబోయే సీఈవో విజయ (జెనీలియా)తో ఓ చిన్న గొడవ. దాంతో విజయ అభిని దూరం పెడుతుంది. ‘నేను సీఈఓ అయిన తొలి రోజే నిన్ను ఉద్యోగం లోంచి తీసేస్తా’ అని హెచ్చరిస్తుంది. మరి… విజయ నిజంగానే అభిని ఉద్యోగం నుంచి తీసేసిందా? అభి, విజయ మధ్య జరిగిన వార్.. ఏ మలుపు తీసుకొంది? అభి, విజయ కలిసి విజయనగరం ఎందుకు వెళ్లాల్సివచ్చింది? అక్కడి మిషన్ ఏమిటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
ముందే చెప్పినట్టు డెబ్యూ హీరో బలాబలాల్ని తూకం వేసి, దానికి తగ్గట్టుగానే కథ రాసి ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. హీరో అంటే డాన్సులు చేయాలి. ఫైట్స్ చేయాలి. ఎమోషన్స్ పండించాలి. అతని ప్రతిభని 360 డిగ్రీల కోణంలో చూపించడానికి తగిన కథ రాసుకొంటే – అది ‘జూనియర్’లా తయారవుతుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సీన్లోనే కిరీటీ ఓ భారీ ఫైట్ చేసేస్తాడు. దాన్ని చాలా స్టైలీష్‌గా కొరియోగ్రఫీ చేశారు. ఆ హంగామా, ఫైట్ డిజైన్ చేసిన విధానం తప్పకుండా నచ్చుతాయి. వెంటనే ఓ పాట. ఆ పాటలో స్టెప్పులు కూడా అదిరిపోతాయి. వందల మంది డాన్సర్లు, వాళ్ల కాస్ట్యూమ్స్, రిచ్ నెస్… కళ్లకు ఇంపుగా కొరియోగ్రఫీ చేసిన పద్ధతీ ఇవన్నీ మంచి మార్కులు కొట్టేస్తాయి. ఆ తరవాత శ్రీలీలని దింపి – లవ్ ట్రాక్ మొదలెట్టారు. అక్కడ హీరో నుంచి కావాల్సినంత కామెడీ, రొమాన్సిజం ఇవన్నీ రాబట్టుకొన్నారు. అలా ఎక్కడికక్కడ హీరో బలాల్ని ప్రెజెంట్ చేసుకొంటూ వెళ్లిపోయారు. ‘ఈ హీరోకి అన్నీ వచ్చు’ అని ప్రేక్షకుడు మొదటి పది నిమిషాల్లోనే డిసైడ్ అయిపోతాడు. ఆ తరవాతి నుంచి కావల్సింది కథ. కథనాలు. హీరో ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆడిన లిఫ్ట్ ఆట బాగుంది. హీరో అక్కడ్నుంచి అన్నీ ఇలానే తెలివిగా మేనేజ్ చేసుకొంటూ వెళ్తే ఇంకా బాగుండేది. విజయని సీఈఓ కాకుండా అడ్డుకొంటా.. అని చెప్పినప్పుడు తప్పకుండా హీరో ఏదో మైండ్ గేమ్ ఆడతాడు అని ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ ఆ సీన్ చాలా సాదా సీదాగా తయారైంది. సదరు సన్నివేశంలో హీరో తెలివితేటల్ని బయటపెట్టే ఛాన్స్ వున్నా, దర్శకుడు వాడుకోలేదు. దాంతో కథకు కీలకమైన ఆ సన్నివేశం రక్తికట్టకుండా పోయింది. కాకపోతే ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ఓ ట్విస్ట్ ఇచ్చారు. అది అద్భుతమైన మలుపు కాకపోవొచ్చు కానీ, ద్వితీయార్థానికి ఓ మంచి లీడ్ దొరికినట్టైంది.
‘జూనియర్’ సెకండాఫ్ ఐటీ ఆఫీసు, అక్కడ జరిగే తతంగం, సీఈఓ సీటు కోసం ఆడే డ్రామా.. ఇలా మలచుకొని ఉంటే బాగుండేది. జెనీలియా – కిరీటీ ఆధిపత్యపోరు లా టర్న్ చేసినా కొత్తగా ఉండేది. సగటు ప్రేక్షకుడూ అవే ఆశిస్తాడు కూడా. కానీ విచిత్రంగా ఈ కథ పల్లెబాట పట్టింది. విలేజ్ డవలెప్ మెంట్ పోగ్రాం అనే కాన్సెప్టు కింద జూనియర్ కథని విజయనగరం షిఫ్ట్ చేశారు. అక్కడ ఈ సినిమా ‘మహర్షి’, ‘శ్రీమంతుడు’ లాంటి కథల్ని గుర్తుకు తెచ్చింది. నిజానికి ‘జూనియర్’ ప్రాజెక్టు ఐదేళ్ల క్రితమే మొదలైంది. అప్పుడే వచ్చి ఉంటే కొంత కొత్తగా అనిపించేదేమో. కానీ ఈ ఐదేళ్ల కాలంలో ‘సినిమా’ చాలా మారిపోయింది. దానికి తగ్గట్టుగా ఈ కథని డైరెక్టర్ ‘అప్డేట్’ చేయలేదు. అన్నట్టు ఈ సినిమాలో ‘అప్ డేట్’ అనే ఓపాట వుంది. దురదృష్టం ఏమిటంటే దర్శకుడు మాత్రం అవుడ్డేటెడ్ కాన్సెప్ట్ ని పట్టుకొన్నాడు. సెల్ ఫోన్ వాడడం ఎలా? దాన్ని మన ప్రయోజనాల కోసం ఎలా వాడుకోవాలి? అనే విషయం చుట్టూ కొన్ని సన్నివేశాలు నడిపి మరీ బోర్ కొట్టించారు. ఫస్టాఫ్‌లో ఓ స్టైలీష్ విలన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విలన్‌కి ఇచ్చిన బిల్డప్పులు అన్నీ ఇన్నీ కావు. అతగాడేదో తన కార్పొరేట్ బుర్రని వాడుకొని హీరోని ఇబ్బందుల పాలు చేస్తాడని ఆశిస్తారు జనాలు. కానీ ఆ బిల్డప్ ఫస్ట్ సీన్‌కే పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ విలన్ ని చివరాఖరికి ఫక్తు కమర్షియల్ విలన్ గా మార్చేశారు. క్లైమాక్స్ లో అయితే హీరో చెప్పే ఎమోషనల్ కథకి తానూ కన్నీరు కారుస్తాడు. ఆ పాత్రని చాలా పేలవంగా ముగించారు. ‘వైరల్ వయ్యారి’ పాట ఆల్బమ్ పరంగా పెద్ద హిట్. ఆ పాటలో స్టెప్పులు అదిరిపోయాయి. థియేటర్ మొత్తం ఊగిపోయేలా శ్రీలీల, కిరీటీ ఇద్దరూ పోటీ పడి డాన్సులు వేశారు. ఆ పాట లేకపోతే సెకండాఫ్ మరింత తేలిపోయేది.
ఓ డెబ్యూ హీరోకి ఇది బెస్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు. కిరిటీ డాన్సుల్లో అదరగొట్టాడు. ఫైట్స్ లో ఈజ్ చూపించాడు. తొలి ఫైట్ లో తన కష్టం కనిపిస్తుంది. ఎమోషన్స్ సీన్లూ బాగానే రక్తి కట్టించాడు. హెయిర్ స్టైల్ మాత్రం కుదర్లేదు. తనకు ఈ సినిమా ఓ విజిటింగ్ కార్డులో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీలీల ఈ సినిమాకి హెల్ప్ అయ్యింది. కానీ ఈ సినిమా శ్రీలీలకు హెల్ప్ అవ్వదు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ కనిపించింది. సెకండాఫ్‌కి వచ్చేసరికి మాయం అయిపోయింది. ‘వైరల్’ పాటలో కూడా హీరో ఊహించుకోవడం వల్ల కనిపించింది కానీ, అక్కడా ఆ పాత్రకు స్కోప్ లేదు. పైగా ఒక్కో ఫ్రేములో ఒక్కోలా కనిపించింది. ‘పెళ్లిసందడి’ రోజుల్లో సైన్ చేసిన సినిమా ఇది. అప్పట్లో శ్రీలీల ఎలా ఉండేది? అనే అనుమానం వస్తే ఈ సినిమా చూడొచ్చు. జెనీలియా చాలా హుందాగా ఉంది. జెనీలియా వల్ల ఆ పాత్రకు ఇంకొంత వెయిటేజీ వచ్చింది. కానీ ఈ పాత్రనీ దర్శకుడు సరిగా డిజైన్ చేయలేదు. ఫస్టాఫ్‌లో పెద్ద ఈగోయిస్ట్ అనే రేంజ్ లో చూపించిన పాత్ర అది. కానీ.. ఆ తరవాత ఆ పాత్ర తాలుకూ గమ్యం, లక్ష్యం మారిపోయాయి. రావు రమేష్, రవిచంద్రన్ పాత్రలు పరిధి మేర ఉన్నాయి.
గాలి జనార్థన్ రెడ్డి తనయుడి సినిమా ఇది. ఆయన అపర కుబేరుడు. సినిమా ఎంత రిచ్‌గా ఉందో వేరే చెప్పాలా? ప్రతీ ఫ్రేమ్ లోనూ నోట్ల కట్టలు కనిపిస్తాయి. టెక్నీకల్ గా స్ట్రాంగ్ టీమ్ దొరికింది. సింథిల్ కెమెరా పనితనం, దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఆటోమెటిగ్గా ఈ యావరేజ్ కథని సైతం క్వాటిటీగా చూపించాయి. తొలి ఫైట్ డిజైన్ చేసిన పీటర్ హెయిన్స్ కి మంచి మార్కులు పడతాయి. సెకండాఫ్ దగ్గర దర్శకుడు కొత్తగా ఆలోచిస్తే బాగుండేది. అక్కడ తడబడ్డాడు. క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా డీల్ చేశాడు. లేదంటే సినిమా మరింత తేలిపోయేది.
అన్నట్టు ఈ సినిమాకి ‘జూనియర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. కాలేజీలో కూడా ఒక్కసారి కూడా హీరోని ‘జూనియర్’ అని పిలిచింది లేదు. ఆఫీసులో కూడా ఎవరికీ ‘జూనియర్’ కాడు. బహుశా కిరీటీ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఈ టైటిల్ వాడుకొన్నాడేమో. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ రిఫరెన్సులు కొన్ని కనిపిస్తాయి. డాన్సుల్లో కూడా ఎన్టీఆర్‌ని ఇమిటేట్ చేయాలని చూశాడు కిరీటి.
తెలుగు360 రేటింగ్: 2.25/5