లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి కోసం, ఆయన విదిలించే చిల్లర కోసం కక్కుర్తి పడిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జైలుకు దగ్గరయ్యారు. అరెస్టు కాకుండా ఉండేందుకు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసిన ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక్క జైలు దారి మాత్రమే మిగిలింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన.. వెంటనే పెద్ద పెద్ద లాయర్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ఎంటర్టెయిన్ చేయలేదు. ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
మిథున్ రెడ్డి తరపు లాయర్లు కనీసం వారం రోజుల పాటు గడుు ఇవ్వాలని కోరారు. దానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అంటే ఆయనను సిట్ అధికారులు ఉన్న పళంగా అరెస్టు చేయవచ్చన్నమాట. అయితే ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నారు. గతంలో విచారణకు హాజరైనా.. ఏ మాత్రం సహకరించలేదు. ఇప్పటికే ఆయన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసేందుకు వారెంట్ కోసం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. వారెంట్ జారీ కాగానే ఆయనను ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తారు.
న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో మిథున్ రెడ్డికి అరెస్ట్ కావడం మినహా మరో దారి లేదు. లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి తరపున అన్నీ చక్క బెట్టింది ఆయనే. ముఖ్యంగా డబ్బుల వ్యవహారాలు, మనీరూటింగ్ సహా అన్ని చూసుకుని ప్రతి శనివారం.. జగన్మోహన్ రెడ్డికి లెక్కలు చెప్పేవారని అంటారు. ఇప్పటికే లిక్కర్ కేసు దర్యాప్తు చివరికి వచ్చింది. అన్ని వ్యవహారాలపై సాక్ష్యాలు సిద్ధం చేసింది. రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయనున్నారు.