తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. టీడీపీతో 43 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు పలికారు. ఈ మేరకు పార్టీ అధినేతకు లేఖ పంపించారు. సాధారణంగా ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తే అసంతృప్తితో చేస్తారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం.. అసంతృప్తితో కాకుండా.. సంతోషంతో చేస్తారు. అశోక్ గజపతిరాజుది కూడా అలాంటి పరిస్థితే అనుకోవచ్చు.
గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతమైనది. ఏ రాజకీయ పార్టీలో లేని వారు ఆ పదవిని చేపట్టాలి. అందుకే గవర్నర్ పదవి రాజకీయ పరంగా వచ్చినప్పటికీ అందరూ తమ తమ పార్టీలకు రాజీనామాలు చేసి పదవులు చేపడతారు. బీజేపీ నేతలుగా ఉండి గవర్నర్లుగా ఎంపికైన వారందరూ బీజేపీకి రాజీనామా చేశారు. పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. విద్యాసాగర్ రావు, తమిళిసై లాంటి వారు అదే చేశారు.
ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అశోక్ గజపతిరాజు కూడా రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ విజయనగరం జిల్లా రాజకీయాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఇక జిల్లా రాజకీయాలను పట్టించుకోరు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు.