ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంగ్ జంప్ ట్రై చేస్తూంటారు. ఐదు సంవతర్సాల సమయంలో ప్రజలకు ఫలితాలు చూపించాల్సిన పరిస్థితుల్లోనూ ఆయన లాంగ్ రేంజ్ లక్ష్యాలు పెట్టుకుంటారు. ఫలితంగా ఐదు సంవత్సరాల కాలం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటూ ఉంటారు. కానీ ఐదేళ్ల పాటు ఆయన చేసిన పనులు కొనసాగిస్తే అద్భుతాలవుతాయి. హైదరాబాద్ విషయంలో అదే జరిగింది. కానీ అమరావతి విషయంలో జరగలేదు. పోలవరం విషయంలో జరగలేదు. జగన్ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి వాటిని పూర్తి స్థాయిలో దారిలో పెట్టక ముందే వేరే ప్రాజెక్టులను ప్లాన్ చేసేస్తున్నారు. అందుకే చాలా మంది వాటి సంగతి తర్వాత ముందు ప్రారంభించిన పని పూర్తి చేయాలని కోరుతున్నారు.
అమరావతికి ఓ రూపం తెచ్చిన తర్వాత రెండో దశ
అమరావతి రెండో దశకు చంద్రబాబు అప్పుడే ప్లాన్ చేశారు. ఎయిర్ పోర్టు కూడా అంటున్నారు. చంద్రబాబు దూరదృష్టి మీద అందరికీ గౌరవం ఉంది. అనేక ప్రపంచవ్యాప్త దిగ్గజ పరిశ్రమల్ని తీసుకు వస్తారు. కానీ ఇప్పటికప్పుడు ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి… మొదటి దశలో భూములు ఇచ్చిన వారికి ఆశించిన ఫలితం వచ్చేలా చేయాలి. ప్లాట్లు వారికి అన్ని మౌలిక సదుపాయాలుతో తిరిగివ్వాలి. ఆ తర్వాతే రెండో దశ చేపడితే ఎక్కువ మంది రైతులు అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు వస్తారు. ఇప్పుడిప్పుడే అమరావతి పనులు పరుగందుకుంటున్నాయి. ఒక్క రెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు, భూములు తీసుకున్న వారందరితో పెట్టుబడులు గ్రౌండింగ్ చేయిస్తే చాలు.. రెండో దశ సూపర్ సక్సెస్ అవుతుంది. అందుకే ఇప్పుడు స్లో చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
పోలవరం పూర్తి చేస్తే తర్వాత బనకచర్ల
పోలవరమే ఓ మెగా ప్రాజెక్టు అనుకుంటే దాని తాత లాంటి బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నెత్తికెత్తుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనానే 80వేల కోట్లు. నిధులు అంతా వివిధ పద్దతుల్లో కేంద్రం ఇస్తామన్నా.. ముందు పోలవరాన్ని పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు ఐదు సంవత్సరాల పాటు ఆగిపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వాటిని కరెక్ట్ చేసి.. కనీసం వచ్చే మూడేళ్లకు అయినా పూర్తి చేసి.. ప్రజలకు అంకితం చేయాలి. అది గొప్ప విజయం అవుతుంది. ఆ తర్వాత బనకచర్ల గురించి ఆలోచించవచ్చు… ఎగువ రాష్ట్రాలు పెట్టే లొల్లికి సమయం కేటాయించవచ్చు. ఇప్పటికే ఇతర పార్టీలన్నీ బనకచర్ల అవసరమా అంటున్నాయి.. జగన్ కూడా అదే అంటున్నారు.
వచ్చే రెండు, మూడేళ్లు అమరావతి, పోలవరం కోసం తగ్గాల్సిందే !
ప్రజలు విజుబుల్ డెవలప్ మెంట్ కోరుకుంటారు. వాటి కోసం తాము చేసిన త్యాగాలకు ప్రతిఫలం కూడా కోరుకుంటారు. అమరావతి కోసం భూములిచ్చిన వారికి.. పోలవరం కోసం కలలు కంటున్న వారికి ముందుగా పాలనా ఫలితాలు చూపించారు. ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెట్టాలి. చంద్రబాబు ఇప్పటికే ఈ అంశంపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని స్లో అయ్యారని భావిస్తున్నారు. వాటిని లైవ్ లోనే ఉంచుకుని.. దృష్టి అంతా.. .A అంటే అమరావతి.. P అంటే పోలవరం మీద పెట్టాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కొన్నింటి కోసం కొన్నింటిలో తగ్గాల్సిందేనని అంటున్నారు.