మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి.. ఆ శివసేన పార్టీ తనదే అని నిరూపించేసుకున్న ఏకనాథ్ షిండే పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతోంది. పార్టీని చీల్చి వచ్చినప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎన్నికలయ్యాక డిప్యూటీ సీఎంను చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నారా లేదా అన్నట్లుగా మారింది. ఆయన పార్టీకి చెందిన మంత్రులపై విచారణలు జరుగుతున్నాయి. రాను రాను కూటమిలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతోంది. అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఫడ్నవీస్ .. ఉద్ధవ్ థాక్రేను తమ కూటమిలోకి రావాలని ఆహ్వానించారు. సరదాగా ఆహ్వానించినట్లుగా అనిపించినా అందులో చాలా రాజకీయాలు ఉంటాయి.
ఏకనాథ్ షిండేకు బీజేపీ మద్దతు లేదు అని తెలిసిన మరుక్షణం ఆయన పార్టీని నమ్ముకుని నేతలు ఉండటం కష్టం. ఏకనాథ్ బలమైన ప్రజానాయకుడు కాదు. థాక్రేలకు ఉన్నంత పలుకుబడి ఆయనకు లేదు. ఇప్పుడు థాక్రే సోదరులు ఏకం కావడంతో.. రాజకీయంగానూ వారు కలసి పని చేస్తారని అంటున్నారు. అదే జరిగితే శివసేన క్యాడర్, ఫ్యాన్స్.. ఓట్లు వేయాలనుకున్న వారు కూడా థాక్రేలవైపే ఉంటారన్న అంచాలు ఉన్నాయి. అందుకే బీజేపీ వ్యూహం మారుతోందని ఏకనాథ్ షిండేను నిర్వీర్యం చేసి.. మళ్లీ శివసేనను ఒకటి చేయాలనుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శివసేన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమయింది. తర్వాత థాకరేలు పూర్తి స్థాయిలో తమ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ, ఫడ్నవీస్ ను అంతగా టార్గెట్ చేయడం లేదు. ముందుగా ఏకనాథ్ ను నిర్వీర్యం చేస్తే.. తమ పని సులువు అవుతుందని అనుకుంటున్నారు. బీజేపీతోనే ఆ పని పూర్తి చేయించేందుకు రెడీ అయ్యారు. బీజేపీ కూడా అదే చేస్తోంది. ఏకనాథ్ అడ్డం పడుతున్నట్లుగా భావిస్తున్నారు. అందుకే మహారాష్ట్రలో వచ్చే కొద్ది రోజుల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.