పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించడం .. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆరాటపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చలేదు. వెంటనే ఆయన సోషల్ మీడియాలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని పార్టీని .. వ్యక్తిగత సామ్రాజ్యంలా చేసుకుంటే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేసిన రికార్డ్ ఉన్న రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ విధానాల గురించి చెప్పడం చాలా మందికి విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా గౌరవించారా అంటే.. చెప్పడం కష్టమే. పదవి ఇస్తే సరే లేకపోతే పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని వ్యాఖ్యానించడం ఆయనకు సహజమే. 2019లో ఆయన గెలిచి.. పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదు. అసెంబ్లీలో కూడా పార్టీ వాయిస్ వినిపించలేదు. ఇక తాను పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీని పాతి పెట్టడానికి మునుగోడు ఉపఎన్నిక కూడా తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పీక నొక్కడానికి మునుగోడు ఉపఎన్నిక కూడా తెచ్చిన రాజగోపాల్ రెడ్డి
మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయం బలపడిన తర్వాతనే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అయినా ఆయన పద్దతిగా ఉన్నారంటే.. అలా ఏం లేదు. తన వల్లే పార్టీ గెలిచిందని విర్రవీగుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి ఇప్పుడు రేవంత్ పై ఆగ్రహంతో ఆయన మాటల్లో తప్పులు వెదుకుతున్నారు. తానేదో కాంగ్రెస్ పార్టీ విలువలను పాటిస్తున్నట్లుగా కవర్ చేసుకుంటున్నారు.
మంత్రి పదవి రాలేదనే కోపమే…. హైకమాండ్ ఇస్తానంటే రేవంత్ వద్దంటారా ?
రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అని .. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికి పది సార్లు చెప్పారు . తన అన్న పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆ ప్రకటనలు ఎప్పుడూ ఖండించలేదు . కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మాట అంటే మాత్రం ఆయనకు కోపం వచ్చింది. .రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం నైతికత, విధేయత లేని రాజకీయాల వల్లనే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఆయనకు విలువ లేకుండా పోయింది. కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే…రేవంత్ అడ్డుపడే పరిస్థితి లేదు. కాని రాజగోపాల్ రెడ్డి మాత్రం.. రేవంత్ పై కోపం పెంచుకుంటున్నారు.