లిక్కర్ స్కాంలో ప్రజల రక్తమాంసాలను పీల్చి కోట్లు దండుకున్న మిథున్ రెడ్డి అనే ఎంపీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపింతే.. ఆయన తనకు కావాల్సిన సౌకర్యాల జాబితాను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆ సౌకర్యాలను కల్పించే విషయంలో అభ్యంతరాలు నేరుగా కోర్టుకు వచ్చి చెప్పాలని.. జైలు అధికారులకు నోటీసులు ఇచ్చింది. జైలు సిబ్బందికి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయో లేవో కానీ.. ఆయన అడిగిన వసతులు చూస్తే మాత్రం.. ఆయనను రాజమండ్రి జైలులో ఉంచడం కన్నా.. తీసుకెళ్లి.. పార్క్ హయాత్ హోటల్లో సూట్ రూమ్లో పెడితే.. సరిపోతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
జైలు గదిలో ఓ అత్యాధునిక టీవీ, మంచి బెడ్, వెస్టర్న్ కమోడ్ ఉన్న టాయిలెట్ సౌకర్యాలు కావాలన్నారు. అంతే కాదు.. మూడు పూటలా బయట నుంచి భోజనం తెచ్చుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. అంటే.. చిప్పకూడు తినరన్నమాట. బయట స్టార్ హోటల్ నుంచి మూడు పూటల భోజనం ..స్నాక్స్ తెప్పించుకుంటారు. అలాగే మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు కూడా రెగ్యులర్గా తనకు అందేలా చూడాలన్నారు. అంతటితో ఆగిపోలేదు.. తనకు సహాయంగా ఉండేందుకు ఓ ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఇలాంటి సౌకర్యాలతో ఓ గది కావాలంటే..స్టార్ హోటళ్లకు రోజుకు లక్ష రూపాయల వరకూ అవుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో కూడా మిథున్ రెడ్డి ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని వీఐపీ ఖైదీలాగా జల్సా చేయాలనుకుంటున్నారు. సాధారణ ఖైదీలకు కనీసం.. సొంత దుస్తులు కూడా వేసుకోనివ్వరు. అసలు ఇలాంటి పిటిషన్లు వేసేంత తెగింపు .. ఇలాంటి నేతలకు ఉందంటే..అది వ్యవస్థలపై ఉన్న అలుసే అనుకోవచ్చు.