కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయంలో ఈడీ అత్యుత్సాహన్ని సుప్రీంకోర్టు గట్టిగానే ప్రశ్నించింది. ఈడీ రాజకీయ ఆయుధంగా మారిన వ్యవహారంపై లోలోపల ఉన్న అసంతృప్తి అంతా బయటకు వచ్చింది. సిద్ధరామయ్య కానీ..ఆయన భార్య కానీ ఒక్క రూపాయి మనీ లాండరింగ్ చేయలేదు. వారు ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ఖరీదైన భూములు కేటాయించారని లోకాయుక్త కేసు. ఆ కేసును మనీ లాండరింగ్ వ్యవహారాలు చూడాల్సిన ఈడీ కూడా తీసుకుంది. కానీ న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తిన్నది. ఇది రాజకీయ పూరిత కేసు అని.. సిద్ధరామయ్యను టార్గెట్ చేసి ఈడీ రంగంలోకి దిగిందని అందరికీ క్లారిటీ ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో అది స్పష్టత వచ్చింది.
అసలు కేసుల్ని వదిలేసి ఈ కేసులు ఎందుకు ?
కాంగ్రెస్ పార్టీ కి చెందిన గాంధీ కుటుంబంపై ఇప్పుడు ఈడీ ఎటాక్ చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ పేరుతో ఓ కేసు నమోదు చేసింది. అందులోనూ మనీ లాండరింగ్ లేదు. కేవలం ఆస్తుల బదలాయింపే ఉంది. ఆ బదలాయింపులో ఎప్పుడో కొన్న ఆస్తుల విలువల్ని ఇప్పటి విలువలతో పోల్చి వేల కోట్లు అని కేసు పెట్టేశారు. అది కూడా రాజకీయ కేసే అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అదే కాదు.. రాజకీయ నేతల మదీ పెద్దగా ఆధారాల్లేకుండా ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందిన వారిపై చేస్తున్న దాడులపై రాజకీయం అన్న ఆరోపణలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లాంటి కేసులు అవసరమా ?
స్కిల్ గేమ్స్ పేరుతో అనుమతులు తీసుకున్న బెట్టింగ్ యాప్స్ కు ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందట ప్రమోషన్ చేసినందుకు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి వాళ్లకు ఇప్పుడు నోటీసులు ఇచ్చింది ఈడీ. కేసు కూడా పెట్టింది. ఇప్పుడు స్కిల్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ వేలల్లో ఉన్నాయి. జాతీయ క్రికెట్ టీముకు స్పాన్సర్ గా కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఐపీఎల్ జరుగుతూంటే.. సగం హడావుడి వీటిదే. పరిస్థితి ఇలా ఉంటే.. ఎప్పుడో చేశారని చెప్పి.. ఇప్పుడు సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం ఏమిటో ఈడీకే తెలియాలి. ఇప్పటికి ఎంతో మంది ప్రమోట్ చేస్తూనే ఉంటే… వీరినెందుకు టార్గెట్ చేస్తున్నారో మరి !
ఇలాంటి కేసుల వల్ల అసలు కేసులపై ప్రభావం
నిజంగా వేల కోట్లు దోపిడీ చేసిన వారు.. మనీ లాండరింగ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కళ్ల ముందే ఉన్నారు. వారు కూడా రాజకీయ నేతలే. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా.. వారు చేసిన నేరాల్ని న్యాయస్థానాల ముందు పెట్టకుండా ఇలాంటి కేసులు తీసుకుని కోర్టులతో చీవాట్లు పెట్టించుకోవడం వల్ల ఏం లాభం?. ఈడీ విశ్వసనీయతపై కోర్టులు ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి వస్తే ఇతర కేసుల్లోనూ సీరియస్ నెస్ తగ్గుతుంది . అందుకే ఈడీ.. రాజకీయ పరమైన కేసులైనా సరే.. ఖచ్చితంగా ఆధారాలతోనే ముందడుగు వేయాలి. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదు. కానీ రాజకీయాల కోసం కేసులు.. అరెస్టులు చేస్తే అసలు దొంగలు కూడా తప్పించుకుంటారు. ఈడీ పవర్ అంతా .. నిర్వర్యం అయిపోతుంది. అది దేశానికే ఇబ్బందికరంగా మారుతుంది.