ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఓ కొత్త రికార్డు సృష్టించారు. ఇందిరా గాంధీ కంటే ఎక్కువ రోజులు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 2025 జూలై 25 నాటికి, నరేంద్ర మోదీ 4,078 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజులు ప్రధానిగా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ 6,130 రోజులు ప్రధానిగా ఉండి మొదటి స్థానంలో ఉన్నారు. ఈ రికార్డును అధిగమించడం ప్రధాని మోదీకి సాధ్యం అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడే ఆయన రిటైర్మెంట్ పై చర్చలు ప్రారంభమయ్యాయి. అధిగమిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఇందిరతో పోలిస్తే ఆ స్థాయి నేతగా పేరు తెచ్చుకున్నారా అంటే.. నిస్సంకోచంగా లేదని చెప్పాలి .
మోదీతో పోలిస్తే ఇందిరనే ధైర్యవంతురాలు
ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ, ఇందిర నిర్ణయాలు మధ్య పోలికలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా జోక్యం వంటి విషయాలు . ప్రధాని మోదీ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని .. అప్పట్లో ఇందిర ఎదుర్కొన్నారు. కానీ అప్పట్లో ఇందిరా యుద్ధాన్ని డీల్ చేసిన వైనం భారత్ కు విజయాన్ని అందించి పెట్టింది. అంతేనా అమెరికాను సైతం పూచిక పుల్లలా తీసి పడేసింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి అయిన భారత్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించారు. కానీ మోదీ అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరణకు అంగీకరించారన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన వచ్చింది.
మోదీతో పోలిస్తే ఇందిరనే మాస్ లీడర్
ఇందిరా గాంధీ ఉక్కు మహిళ అంటారు. ఎందుకంటే ఆమె నిర్ణయాలు అంత బలంగా ఉండేవి. ఆమె గరీబీ హఠావో నినాదానికి దేశం అంతా కదిలిపోయింది. ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగిందో ఇప్పటి తరానికి తెలియదు. కానీ ఆమె పరిపాలనా కాలంలో దేశం గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడిందని ఎవరికి తలొగ్గలేదని అందరూ అంగీకరిస్తారు. అదే సమయంలో దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె రాజకీయాలపై అనేక విమర్శలు ఉండవచ్చు .. కాంగ్రెసేతర ప్రభుత్వాలను కుప్పకూల్చే విషయంలో రాజ్యాంగాన్ని సైతం ధిక్కరించారు. అయితే ప్రతీ దానికి ఆమె ప్రతిఫలం అనుభవించారు. ఎమర్జెన్సీ విధించినందుకు ఘోర ఓటమిని ఎదుర్కొన్నారు. స్వయంగా తాను కూడా ఓడిపోయారు. అయితే తర్వాత ఆమె అంత కంటే భారీ విజయం సాధించారు. అందుకే.. ఇందిరాగాంధీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.. వాటి ఫలితాలను అనుభవించారు. మళ్లీ ప్రజాభిప్రాయాన్ని చూరగొన్నారు. దేశం నలుమూలలా ఇందిరకు ఆదరణ ఉండేది. మోదీతో పోలిస్తే.. ఇందిరనే మాస్ లీడర్ అనుకోవచ్చు.
రోజుల రికార్డు అధిగమించవచ్చు కానీ..!
ఇందిరా గాంధీకంటే ప్రధాని మోదీ ఎక్కువ కాలం పదవిలో ఉండవచ్చు కానీ.. పాలనా సామర్థ్యంలో .. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూస్తే.. ప్రధాని మోదీ.. ఇందిర కంటే వెనుకే ఉంటారని ఎక్కువ మంది అభిప్రాయపడతారు. అయితే ఇందిర కాలం నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇందిరా ప్రధానిగా ఉన్నా.. ప్రధాని మోదీలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అనుకోవచ్చు. గ్లోబలైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సున్నితంగా మారింది. అప్పట్లో అదేమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రజల గురించి .. వారి రోజు వారీ జీవనం డిస్ట్రబ్ కాకుండానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే.. ఇద్దర్నీ పోల్చడం సరి కాదు కానీ.. పరిస్థితుల్ని బట్టి.. నిర్ణయాలను బట్టి చూస్తే.. ఇందిరకే ఎక్కువ మార్కులు పడతాయని అనుకోవచ్చు.