జాగృతిని బలోపేతం చేసుకునేందుకు యువలీడర్లను ఆకట్టుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. నాయకులుగా తయారు చేస్తానని చెప్పి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్ లో రెండు సెషన్లుగా శిక్షణ తరగతులు శనివారం నిర్వహిస్తున్నారు. ‘‘లీడర్’’ నాయకత్వ శిక్షణ కార్యక్రమం అని పేరు పెట్టారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, హక్కులపై అవగాహన వివిధ రంగాల నిపుణులు అవగాహన కల్పిస్తారు.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యులలో ఎంపిక చేసిన ప్రతినిధులకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఉమ్మడి పది జిల్లాల వారీగా ‘‘లీడర్’’ నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు ఇస్తారు.
యువ నాయకత్వంపైనే కవిత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి అభిమానంగా ఉండే యువతే ఎక్కువగా కవిత వైపు వస్తారు అందుకే బీఆర్ఎస్ కూడా కౌంటర్ కార్యక్రమాలు చేపడుతోంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాచారంలో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కవిత సమావేశానికి ఎక్కువ మంది బీఆర్ఎస్ యువనేతలు వెళ్లకుండా చూసే వ్యూహంలోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎవరిది పైచేయి అవుతుందో ?