మహేష్ బాబు – త్రివిక్రమ్ అతడు సినిమాకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు ఆశించినంతగా ఆడలేదు కానీ టీవీల్లో ట్రిపుల్ ప్లాటినం జూబ్లీ ఆడేసింది. త్రివిక్రమ్ రైటింగ్, మహేష్ బాబు ప్రెజెన్స్ ఈ సినిమాను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.
ఇప్పుడు ఈ సినిమా 4Kలో రిలీజ్ అవుతోంది. సినిమాను నిర్మించిన మురళీమోహన్ ఆధ్వర్యంలో సినిమా 4Kలోకి వస్తోంది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో అతడు 2 ప్రస్తావన కూడా వచ్చింది. ఒకవేళ ఈ సినిమాకి పార్ట్2 తీస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలోనే మహేష్ బాబు హీరోగానే తీస్తానని, వాళ్లు డేట్స్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చారు మురళీమోహన్.
నిజానికి అతడు రిలీజ్ అయినప్పుడు ఇది అంత లాభాలు తెచ్చిన ప్రాజెక్ట్ కాలేదు కానీ తర్వాత కాలంలో సినిమాకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకి పార్ట్ 2 చేసే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ గుర్తుండే వుంటుంది.
శివారెడ్డిని మర్డర్ చేసినవాడు (సోనూ సూద్) యాక్సిడెంటుగా పోయాడు.
ప్లాన్ చేసినవాడు (కోట శ్రీనివాసరావు) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంకా ఈ కేసులో మిగిలింది ఒక్కడే… నందు (మహేష్).
ఇంకేంటి పార్ధు (మహేష్) కబుర్లు…
క్లైమాక్స్‌లో సిబిఐ ఆఫీసర్ ప్రకాశ్ రాజ్ పాత్ర చెప్పిన డైలాగులు ఇవి. అలా నందును పార్ధుగా మార్చి బాసర్లపూడి ఇంటికి పించేస్తాడు త్రివిక్రమ్.
శివారెడ్డి కేసు మీద సాగే కథ కావడంతో ఈ ఒక్క కేసు వరకు నందు బయటపడతాడు కానీ లాజికల్‌గా ఆలోచిస్తే… నందు ఒక క్రిమినల్. అలాంటి క్రిమినల్ సిబిఐ ఆఫీసర్ రాడార్‌కి దొరికితే ఇంత సింపుల్‌గా వదిలిపెట్టారు. అదొక ఓపెన్ ఎండింగ్ కథగానే చూడాలి.
త్రివిక్రమ్ చాలా కంఫర్టబుల్‌గా తన మాటలతో కథకు శుభం కార్డు వేయగలిగారు. ఇప్పుడు ఆ కథను రీఓపెన్ చేయడం కూడా తేలికే. నందుకు క్రిమినల్ హిస్టరీ ఉంది. ఎక్కడో ఒకచోట నుంచి ఒక లింక్ కదిపినా అతడు కథను ఇంకా విస్తరించవచ్చు. త్రివిక్రమ్ అనుకుంటే దీనిని విస్తరించడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే ఇప్పుడున్న కమిట్మెంట్స్కి అతడు 2 కథను ఆలోచించేంత సమయం త్రివిక్రమ్‌కు ఉందా? గుంటూరు కారం లాంటి ఒక చేదు అనుభవాన్ని చూసిన తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో జతకట్టడానికి మహేష్ మొగ్గు చూపుతారా? అనేదే ఇక్కడ అసలు పాయింట్.