విజయ్ దేవరకొండ ది కొంత ఎగ్రసీవ్ మెంటాలిటీ. దూకుడు స్వభావం ఎక్కువ. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తాడు. ఆ మాటలే అభిమానులకూ నచ్చుతాయి. కాకపోతే కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి. దాంతో ట్రోలింగ్ మొదలవుతుంది. హిట్ లో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడినా బాగానే ఉంటుంది. అదే ఫ్లాప్ ఎదురైతే, ఆ మాటలే తిరిగొచ్చి శూలాల్లా గుచ్చుకొంటుంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. తన సినిమాకు ముందు విజయ్ చాలా ఎగ్రసీవ్ గా మాట్లాడుతుంటాడు. సినిమా రిలీజ్ అయి, ఫలితంలో తేడా వస్తే, ఆ ఎగ్రసీవ్ నెస్ కొంప ముంచుతుంటుంది. విజయ్ మాటలు రాంగ్ రూట్ లో వెళ్లి, తనని టార్గెట్ చేస్తుంటాయి. తన సినిమాని మరింత డామేజ్ చేస్తుంటాయి. ఈ విషయంలో విజయ్ మారితే బాగుంటుందన్నది అందరి కోరిక. ఇప్పుడు ఆ మార్పు విజయ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
‘కింగ్ డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడాడు. తన స్పీచ్ ఎప్పట్లా బాగుంది. కానీ.. చాలా కంట్రోల్ లో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడా ‘ఈ సినిమాతో చించేస్తా.. పొడిచేస్తా’ అనలేదు. ‘వాట్ లగాదేంగే..’ అనే డైలాగులు విసర్లేదు. సినిమా ఫలితమే మాట్లాడుతుంది అనే భావన కనిపించింది. సందీప్ రెడ్డి వంగాతో విజయ్ ఓ స్పెషల్ చిట్ చాట్ చేశాడు. అక్కడ కూడా విజయ్ ఆచి తూచి మాట్లాడాడు. చాలా కంట్రోల్ లో ఉన్నట్టు అనిపించింది. దీనంతటికీ కారణం… నాగవంశీ. ‘కింగ్ డమ్’ సినిమాకి ఆయనే నిర్మాత. ”ఈ సినిమా విడుదలయ్యేంత వరకూ కామ్ గా ఉండు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకు..” అంటూ ముందు నుంచీ రౌడీని నాగవంశీ కంట్రోల్ చేసుకొంటూ వచ్చాడు. విజయ్ కూడా దాన్ని పాటించాడు. ‘కింగ్ డమ్’ రిలీజ్‌కు ముందు విజయ్ ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వదలచుకోలేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఏ స్టేట్ మెంట్ మిస్ ఫైర్ కొడుతుందో, అది తన సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అనే ముందు చూపు. ఈ జాగ్రత్త ఈ రోజుల్లో చాలా అవసరం. విజయ్ లాంటి హీరోలకు మరింత అవసరం. విజయ్ బండి కాస్త స్లో అయ్యింది. అది ఇప్పుడు మళ్లీ స్పీడెక్కాలి. అంటే… ఓ హిట్ చాలా అవసరం. దాన్ని ఏ రూపంలోనూ చేజార్చుకోకూడదన్న పట్టుదల విజయ్‌లో వుంది. దాని ఫలితం ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ స్పీచ్‌లో కనిపించింది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. అక్కడ కూడా ఇలానే కంట్రోల్ లో ఉంటే నాగవంశీ ప్రయత్నం ఫలించినట్టే.