టెస్ట్ క్రికెట్ ఎందుకు గొప్పదో తెలుసా? అది టెక్నిక్ తో ఆడాల్సిన ఆట. రెండో ఛాన్స్ ఇక్కడే దొరుకుతుంది. ఓ ఇన్నింగ్స్ లో సరిగా ఆడకపోతే.. రెండో ఇన్నింగ్స్ లో ఆ అవకాశం మళ్లీ వస్తుంది. ఓడిపోతామేమో అనే మ్యాచ్‌ని పట్టుదలతో కాపాడుకొనే ఛాన్స్ టెస్ట్‌లో ఉంటుంది. అందుకే టీ 20 యుగంలో కూడా టెస్ట్ క్రికెట్ బతికి వుంది. ఇప్పటికీ ఈ ఫార్మెట్ ని ఆస్వాదిస్తున్నారు. ఇంగ్లండ్ తో భారత్ ఇప్పుడు ఓ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ ఆట… క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ప్రేమికులకు కావల్సినంత మజా పంచుతోంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం ప్రదర్శించింది. అయితే భారత జట్టు ఏమాత్రం తీసిపోకుండా గట్టిగా పోరాడుతోంది. ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ని ఓడించడం అంటే మాటలు కాదు. ఓ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మూడో టెస్ట్ లో అద్భుతంగా పోరాడింది. దాదాపు గెలవాల్సిన మ్యాచ్ అది. తృటిలో పరాజయం పాలైంది. తొలి టెస్ట్ లో క్యాచ్‌లను జారవడవకుండా భారత్ ఈపాటికి 2-1 తో ముందంజలో ఉండేది.
ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ కూడా దిగ్విజయంగా చివరి రోజు వరకూ వెళ్లింది. నాలుగో రోజు భారత బ్యాటర్లు గిల్, రాహుల్ అద్భుతంగా ఆడారు. ఈ టెస్ట్ డ్రా చేయడానికి తమవంతు పాత్ర పోషించారు. మూడొందల పైచిలుకు లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్… తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు మరో 65 ఓవర్ల ఆట బ్యాలెన్స్. అలాంటప్పుడు ఈ మ్యాచ్ 5వ రోజు వరకూ వెళ్తుందని ఎవరు అనుకొంటారు? నాలుగో రోజే.. భారత్ ఆలౌట్ అవుతుందని లెక్కగట్టారు. కానీ భారత్ అద్భుతంగా పోరాడింది. రాహుల్, గిల్ ఆడిన డిఫెన్స్.. భారత్ ని గట్టెక్కించింది. టీ 20 వచ్చాక.. ప్రతీ బంతీ ఫోరో, సిక్సో కొట్టాలని క్రికెట్ అభిమాని కోరుకొంటాడు. కానీ టెస్ట్ క్రికెట్ వేరు. ఇక్కడ కొన్నిసార్లు ‘జిడ్డు’ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. డిఫెన్స్ చేస్తే.. సిక్స్ కొట్టిన ఆనందం కలుగుతుంది. గిల్, రాహుల్ డిఫెన్స్ ఆడుతుంటే అలాంటి ఫీలింగే వచ్చింది. 65 ఓవర్ల పాటు ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గోడ కట్టేశారు. 5వ రోజు వరకూ ఈ ఆట వెళ్లిందంటే ఇదంతా వాళ్ల పుణ్యమే.
అయితే ఆట ఇక్కడితో అయిపోలేదు. 5వ రోజు దాదాపు 90 ఓవర్లు కాచుకోవాలి. అంటే.. భారత బ్యాటర్లు కలసికట్టుగా రాణించాలి. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఓటమి ఖాయం. సిరీస్ కూడా కోల్పోతారు. కాబట్టి 5వ రోజు మన వాళ్లు ఎంత జిడ్డు ఆడితే.. అంత గొప్ప. తొలి ఇన్నింగ్స్ లో గాయపడిన పంత్ బ్యాటింగ్ కి వస్తాడో రాడో అనేది అనుమానం. వచ్చినా.. కుదురుగా ఆడే అవకాశం లేదు. కాబట్టి పంత్ ని లెక్కలోకి తీసుకోకూడదు. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నట్టే అనుకోవాలి. తొలి సెషన్ చాలా కీలకం. 4వ రోజులానే గిల్, రాహుల్ ఒద్దిగ్గా ఆడితే భారత్ ఈ మ్యాచ్ డ్రా చేసుకోగలదు. వీళ్లే కాదు.. జడేజా, వాష్టింటన్ సుందర్, శార్దూల్ వీళ్లు కూడా తమ బ్యాటింగ్ ప్రతిభ చూపించాల్సిన సమయం ఇది. నిజంగా భారత్ కలసికట్టుగా ఆడి డ్రా చేసుకోగలిగినా ఈ మ్యాచ్ గెలిచినట్టే లెక్క.