డాక్టర్లను నమ్మకపోతే ఇంకెవర్ని నమ్ముతారు?. కానీ ఈ డాక్టర్లు తమపై ఉన్న నమ్మకాన్ని ఓ మాఫియాగా మార్చుకుని దోచేస్తున్నారు. అసలు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతే రీతిలో సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ ఆస్పత్రి డాక్టర్ మోసం చేశారు.
సృష్టి టెస్టు ట్యూబ్ పేరుతో పలు చోట్ల ఆస్పత్రులు నిర్వహిస్తున్న నమ్రత అనే డాక్టర్.. ఓ జంటకు పిల్లలు పుట్టరని తేల్చి.. సరోగసి ద్వారా బిడ్డను పుట్టిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొత్తం నలభై లక్షలు వసూలు చేసి సరోగసి ద్వారా ఓ బిడ్డ పుట్టిందని చెప్పి చేతికి ఇచ్చారు. డీఎన్ఏ టెస్టులు చేయించాలని కోరినా చేయించలేదు. ఆ బిడ్డను తీసుకుని ఆ దంపతులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స చేయించడమే కాకుండా.. డీఎన్ఏ టెస్టులు కూడా చేయించారు. ఇద్దరిలోఒక్కరి డీఎన్ఏ కూడా మ్యాచ్ కాకపోవడంతో హైదరాబాద్ కు వచ్చి ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. అయితే డాక్టర్ తప్పించుకుతిరిగారు. చివరికి విసిగిపోయి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన పోలీసులు ఆ దంపతులకు అసలు సరోగసి చేయలేదని ఓ ఒడిషా దంపతుల నుంచి బిడ్డను కొని.. సరోసి చేయించినట్లుగా చెప్పి ఇచ్చారని పోలీసులు తేల్చారు. ఇంత ఘోరమైన మోసం చేస్తారని ఆ దంపతులు ఊహించలేకపోయారు. డాక్టర్ ను అరెస్టు చేశారు. ఇది బయటపడిన నేరమే.. ఇంకెంత మందిని మోసం చేశారోనని ఆరా తీస్తున్నారు. పెరుగుతున్న ఇన్ ఫెర్టిలిటీ సమస్యల కారణంగా పిల్లలులేదని దంపతులతో ఇలాంటి డాక్టర్లు వ్యాపారం చేస్తూ అనైతికంగా ప్రవర్తిస్తున్నారు.