చీకటి చరిత్రతో నిండిన ఓ ప్రాంతం…
తమ ఇష్టదైవాన్ని బతికించాలనే ఓ సమూహం…
కాయిన్ పెడితే వరాలు ఇచ్చే ఓ మెషిన్…
మండలం పోలికతో వరుసగా జరుగుతున్న హత్యలు…
ఒక వెబ్ సిరీస్ నడపడానికి ఈ సెటప్ చాలు. నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన “మండల మర్డర్స్” ఈ సెటప్‌తో వచ్చింది. వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా లాంటి గ్లామరస్ తారలతో పాటు యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సిరీస్‌తో భాగమయ్యారు. ఇంతకీ మండల మర్డర్స్ వెనక ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ సీక్రెట్ కల్ట్ కథ ఆడియన్స్‌కి థ్రిల్ ఇచ్చిందా?
1952లో చరందాస్పూర్లోని ఓ అటవీ ప్రాంతంలో కథ మొదలౌతుంది. రుక్మిణి (శ్రియా పిల్గాంకర్) తను కొలిచే యస్త్ అనే దేవతకు పునర్జన్మను ఇవ్వడానికి తన సమూహంతో కలసి ఏవో మార్మిక, క్షుద్ర విధానాలని అనుసరిస్తుంటుంది. రుక్మిణి లాంటి మంత్రగత్తె బతకడానికి వీలు లేదని ఆమె సమూహంపై అక్కడ గ్రామస్తులు దాడి చేస్తారు. దీంతో ఆమె ప్రయత్నం మధ్యలో ఆగిపోతుంది.
కథ ప్రెజెంట్‌లోకి వచ్చిన తర్వాత వరుసగా కొన్ని హత్యలు జరుగుతాయి. ఈ కేసును చేధించడానికి క్రైమ్ డిటెక్టివ్ రియా (వాణీ కపూర్) రంగంలో దిగుతుంది. అదే ఊర్లో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న అనన్య (సుర్వీన్ చావ్లా)ని ఈ కేసు నిమిత్తం విచారిస్తుంది రియా. ఇదే సమయంలో అనన్యపై ఓ దాడి జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది? ఇంతకీ అనన్య ఎవరు? రుక్మిణి ఆశయానికి ఇప్పుడు జరుగుతున్న హత్యలకు లింక్ ఉందా? అసలు రియా ఎవరు? ఈ కేసును ఎలా చేధించింది? అనేది మిగతా కథ.
కొన్ని కాన్సెప్ట్స్ మొదలుపెట్టినప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. తర్వాత ఏమి జరగుతుందో అన్న ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక దశలోకి వచ్చిన తర్వాత ఓపెనింగ్‌లో ఇచ్చిన థ్రిల్ ని కొనసాగించడంలో మిస్‌ఫైర్ అవుతాయి. మండల మర్డర్స్ కూడా ఇలాంటి సిరీస్‌నే. ఆరంభం ఏదో మైండ్ బెండింగ్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఆశలు రేపిన సిరీస్ రెండు ఎపిసోడ్లు తర్వాత లెక్కకు మించిన పాత్రలు, జానర్లు, బ్యాక్స్టోరీలతో తికమకపడి చివరికి ఓ కల్ట్ సొసైటీతో కథగా ముగిసిపోతుంది.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఒకొక్క ఎపిసోడ్ నిడివి దాదాపుగా 40 నిముషాలు. స్పిరిచువల్ రాడికల్స్, యస్త్ బ్యాక్‌డ్రాప్‌తో కథ మొదలౌతుంది. విరూపాక్ష ఓపెనింగ్ సీక్వెన్స్ తలపించే ఆ ఘట్టం సిరీస్‌పై ఒక్కసారిగా అంచనాలను పెంచుతుంది. ఎప్పుడైతే రియా థామస్ (వాణీ కపూర్), విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) పాత్రలు ప్రవేశిస్తాయో అప్పటి నుంచి ఓ మామూలు క్రైమ్ థ్రిల్లింగ్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. మొదటి, చివరి రెండు ఎపిసోడ్లు ఓకే కానీ మిగతా నాలుగు ఎపిసోడ్స్‌లో ప్రేక్షకుడిని కట్టిపడేసే కంటెంట్, కథనం కరవయ్యింది. కోరికలు నెరవేర్చే విష్ మెషిన్ లాజిక్‌కి అందదు. వరుస జరిగే హత్యలు కూడా వాట్ నెక్స్ట్ అనే ఆసక్తిని పెంచడంలో కలిసిరాలేదు. బ్యాక్‌స్టోరీలు ఎక్కువైపోయాయి. క్రైమ్, ఫాంటసీ, సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్… ఇలా జానర్లు మార్చడం కూడా గందరగోళానికి కారణమవుతుంది.
ఈ సిరీస్‌కి ప్రధాన లోపం ప్రధాన పాత్ర పోషించిన వాణీ కపూర్. ఈ వరల్డ్ బిల్డింగ్‌లో ఆమె సెట్ అవ్వలేదు. ఇలాంటి సిరీస్‌కి ప్రేక్షకుడిని హోల్డ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కానీ వాణీలో అలాంటి నటన పలకలేదు. విక్రమ్ సింగ్‌గా చేసిన వైభవ్ రాజ్ గుప్తా ఓకే అనిపిస్తాడు. పవర్ కోసం ఏదైనా చేసే లోకల్ పొలిటీషియన్ అనన్య (సుర్వీన్ చావ్లా) మాత్రం ఆకట్టుకుంది. తన చుట్టూ ఉన్న కథ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగింది. మిగతా నటీనటులు పరిధి మేర కనిపిస్తారు.
టెక్నికల్‌గా సినిమా సిరీస్ రిచ్‌గా ఉంది. ఓల్డ్ కల్ట్ సొసైటీ బాగా బిల్డ్ చేశారు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ బాగా కుదిరింది. ఎలాంటి అంచనాలు లేకుండా చూడటం మొదలుపెడితే ఓ మోస్తారు థ్రిల్‌ను పంచే సిరీస్ ఇది.