ద్విపాత్రాభినయాలు, త్రిపాత్రాభినయాలూ బాలకృష్ణకు కొత్తేం కాదు. అగ్ర హీరోల్లో బహుపాత్రాభినయాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. `అధినాయకుడు`లో ట్రిపుల్ రోల్ పోషించారు బాలయ్య. ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలో గోపీచంద్ మలినేని సినిమా మొదలెడతారు బాలయ్య. ఆ వెంటనే అంటే ఈ యేడాది చివర్లోగా `ఆదిత్య 999` మొదలైపోతుంది. ఈ సినిమాతోనే నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా తెరంగేట్రం చేయబోతున్నాడు.
ఇందులోనే బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రలేమిటన్నవి ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఆదిత్య 369’లో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీకృష్ణదేవరాయులుగా తెరపై కనిపించి అభిమానుల్ని అలరించారు. ఈసారి మూడు పాత్రలన్నమాట. మోక్షజ్ఞ ఎంట్రీ, బాలయ్య ట్రిపుల్ రోల్ తో పాటుగా మరికొన్ని ఆకర్షణలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. అవన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. ఆదిత్య 369లో భూత, భవిష్యత్, వర్తమానాల్ని చూపించారు సింగీతం. ఈసారి క్రిష్ వాటితో పాటుగా కొత్త లోకాల్ని ఆవిష్కరించే అవకాశం ఉంది.