భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గత రెండు రోజులుగావరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు ముఖ్య నేతలెవర్నీ పిలవడం లేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావులతో పాటు జగదీష్ రెడ్డి లాంటి ఒకరిద్దరికి మాత్రమే ఆహ్వానాలు అందుతున్నాయి. అందులో ఏం చర్చిస్తున్నారో మాత్రం క్లారిటీ లేదు. గురువారం రోజంతా.. కేటీఆర్, హరీష్ రావులు ఫామ్ హౌస్‌లోనే చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం కూడా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ఈ సమావేశాలు కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరిన అంశంపై చర్చించినట్లుగా భావిస్తున్నారు.
జస్టిస్ పీసీ ఘోష్.. కాళేశ్వరంపై సమగ్ర నివేదిక అందించారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి.. ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది. దాదాపుగా650 పేజీల వరకూ ఉన్న ఈ నివేదికను.. ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా పరిశీలించి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో చర్చించి.. క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుడుగు వేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో కేసీఆర్ .. తదుపరి పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీష్ లకు.. దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. కాళేశ్వరం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ఎదురుదాడి చేయాల్సి ఉందని లేకపోతే .. కాంగ్రెస్ చేసే ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోతుందని అనుమానిస్తున్నారు. అందుకే.. ఏం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్నదానిపైనా కేసీఆర్ సలహాలిచ్చినట్లుగా తెలుస్తోంది.