ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఈసీ ఓట్లు దొంగిలిస్తోందని తమ దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు.అవి బయట పెడితే ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు.తప్పులు చేసిన ఈసీ అధికారులు రిటైరైపోయినా సరే.. వెదికి తీసుకొచ్చి శిక్షిస్తామని కూడా హెచ్చరించారు. బీహార్ లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించే ఆయన చెబుతున్నారు.
నిజంగా రాహుల్ గాంధీ వద్ద ఆధారాలుంటే.. బయట పెట్టడానికి ఇంత కన్నా గొప్ప సమయం ఉండదు. వారు దేని కోసం పోరాడుతున్నారో ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇప్పుడే ఆధారాలు బయట పెట్టాలి. ఎన్నికల సంఘం తప్పు చేస్తే దేశ ప్రజలంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఈసీ మీద బెదిరించేలా ఆరోపణలు చేసి..బురద చల్లేసి సైలెంట్ గా ఉంటే ఈసీ విశ్వసనీయతను దెబ్బతీసినట్లవుతుంది కానీ..కాంగ్రెస్ కు ప్రయోజనం ఉండదు.
ఈసీ ప్రతి రాష్ట్రంలోనూ ఓట్లను దొంగిలిస్తోందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇప్పటికే అలా కొన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీహార్లోనూ ఓటమి పాలు కాకుండా ఉండాలంటే.. ముందుగానే సాక్ష్యాలను బయట పెట్టాలి. ఈసీ తప్పులను వెలుగులోకి తేవాలి. కానీ బెదిరిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈసీ కూడా అదే చెబుతోంది. తాము చేస్తున్న రివిజన్ లో తప్పులుంటే చెప్పాలని కోరుతోంది. కానీ రాహుల్ మాత్రం దొంగతనం ఆరోపణలు చేసి.. సాక్ష్యాలున్నాయంటున్నారు.