ఉరుములేని మెరుపులా అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు ప్రారంభించారు. ఒక్క రోజు గడవక ముందే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఐదో తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. విదేశాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని దారి మళ్లించారన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఇదంతా కొత్తగా జరగలేదు. చాలా ఏళ్లుగా ఉంది. కానీ ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ?
బ్యాంకులకు అనిల్ అంబానీ కంపెనీల బాకీ వేల కోట్లలోనే !
అనిల్ అంబానీ చాలా కంపెనీలు పెట్టారు. వాటి పేరుతో బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకున్నారు. ఇక్కడి బ్యాంకుల నుంచే కాదు.. అంతర్జాతీయ బ్యాంకుల నుంచీ తీసుకున్నారు. కానీ ఎవరికీ తిరిగి కట్టిన పాపాన పోలేదు. స్టేట్ బ్యాంక్ అయితే ఆయన అప్పుల్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద మార్చేసింది. ఇతర బ్యాంకులకూ అంతే. అయితే ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న మూడువేల కోట్లను మనీ లాండరింగ్ చేసి విదేశాలకు పంపేశారన్న ఆరోపణలపై ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది. అవి ఆరోపణలు కాదు.. డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్. లోన్ తీసుకుని.. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో పంపించేశారు. అందుకే ఈడీ రంగంలోకి దిగింది.
గోల గోల కాక ముందే ఇలా రక్షిస్తున్నారా ?
ఇది జరిగింది .. నిన్నామొన్న కాదు. చాలా ఏళ్ల కిందట. ఇప్పుడే ఎందుకు ఈడీ గుర్తించిందంటే.. ఇప్పుడే ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. కానీ ఇతర ఫిర్యాదుల సంగతేమిటి?. ఈ విషయం బయటకు వచ్చి యస్ బ్యాంకును నిండా ముంచేశారన్న ప్రచారం ప్రారంభం కాక ముందే..కేసు నమోదు చేసి.. విచారణ జరిపితే పనైపోతుందని అనుకుని ఉండవచ్చన్న అనుమానం ఎక్కువగా జన బాహుళ్యంలో వినిపిస్తోంది. స్కామ్ బయటపడ్డాక .. పట్టుకుంటే ఎక్కువ గోల జరుగుతుంది. ఇప్పుడే గుర్తించినట్లుగా కేసులు నమోదు చేస్తే.. తర్వాత ఎస్ బ్యాంక్ కు జరిగే నష్టాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయానికి వస్తారు.
అనిల్ అంబానీపై తీసుకున్న చర్యలే లేవు !
ఒకప్పుడు ప్రపంచ కుబేరులలో ఒకరు అనిల్ అంబానీ ఇప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదని దర్యాప్తు సంస్థలకు, అప్పులు ఇచ్చిన బ్యాంకులకు చెబుతున్నారు. అనిల్ అంబానీ చేసిన అప్పులతో పోలిస్తే విజయ్ మాల్యావి అసలు అప్పులే కాదు. అనిల్ అంబానీ లోన్ల పేరుతో పెద్ద ఎత్తున ఇప్పటికే దారి మళ్లించి వేల కోట్లు దాచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కూడా.. కేసులు పెట్టి అలా నడిపిస్తారు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోరని..ఇదంతా ఆయనను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నమన్న అభిప్రాయాలూ బలంగానే వినిపిస్తున్నాయి. అంబానీ ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నా.. బ్యాంకులకు కట్టిస్తేనే ప్రజలు నమ్ముతారు.