ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే అభివృద్దికి ప్రాధాన్యతనిస్తారు. అలాగని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని ఎలా ప్రచారం చేస్తారో .. చంద్రబాబు పాలన విషయంలోనూ అలాగే ప్రచారం చేస్తారు. ఆయన అభివృద్ధిని చూస్తారు కానీ ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చరని ప్రచారం చేస్తారు. ఈ సారి అలాంటి ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో నేరుగా లబ్దిదారులతోనే చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.
కీలకమైన పథకాలన్నీ అమల్లోకి !
సూపర్ సిక్స్ లో భాగంగా ప్రధానమైన పథకాలన్నీ ఈ నెలతో అమలు అయిపోతాయి. తల్లికి వందనం పథకం లాంటి పథకంలో గ్రీవెన్స్ పెడితే వెల్లువలా జనం రావాలి. కానీ తమకు రాలేదు అని వచ్చిన వారు చాలా తక్కువ. గతంలో అమ్మఒడి పథకంలో ఓ జిల్లాలో గ్రీవెన్స్ పెడితే కరెక్టరేట్ వద్ద కిలోమీటర్ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ సారి రికార్డుల్లో ఉన్న తప్పుల వల్ల స్వల్ప సమస్యలు వస్తే వెంటనే సరి చేశారు. కేంద్ర పథకంతో లింకప్ వల్ల కొంత మంది తక్కువ డబ్బులు పడినా.. వెంటనే క్లారిటీ ఇచ్చారు. అన్న క్యాంటీన్లు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నారు. ఉచిత బస్సు అమల్లోకి వస్తోంది. చేనేతలకు ఉచిత విద్యుత్ ఏడో తేదీ నుంచి ఇస్తున్నారు. ఇలా .. సామాన్యులకు నిజమైన లబ్ది కలిగేలా.. పథకాలన్నీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు గోల్ కొట్టారు. భారీగా పెంచడమే కాదు..కొత్తగా మరో లక్ష మందికి మంజూరు చేశారు.
ఇలా ఇచ్చి.. అలా లాక్కునేది గత ప్రభుత్వం
గత ప్రభుత్వం డీబీటీ పథకాలను అమలు చేసేది కానీ.. వెంటనే వాటిని వసూలు చేసే లా పలు స్కెచ్లు వేసేవాళ్లు. చెత్తపన్ను దగ్గర నుంచి వన్ టైం సెటిల్మెంట్ వరకూ చాలా స్కీములు ఉండేవి. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి రూపాయి కూడా వెనక్కి తీసుకునే పథకాలు పెట్టలేదు. వన్ టైం సెటిల్మెంట్ లాంటివి ఏమీ పెట్టలేదు. ప్రజలకు నేరుగా డబ్బులు మిగిల్చే పథకాలు అమలు చేయడమే కాదు.. వారి ఖాతాల్లో పడే డీబీటీ పథకాలు కూడా వారి జీవితాలు మెరుగుపడేలా ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ప్రభుత్వానికి పాజిటివిటీ పెరగడానికి కారణం అయింది.
అభివృద్ధిలోనూ వెనక్కి తగ్గని వైనం
అభివృద్ధి చేస్తే.. సంక్షేమం చేయడం లేదని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి.. నేరుగా లబ్దిదారులకే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతున్నారు. అదే సమయంలో వారి బతుకుల్ని దీర్ఘ కాలంలో మార్చడానికి పెట్టుబడులు తీసుకు వస్తున్నామని.. అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పటికే మెరుగుపడిన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు.. ప్రజల్ని సంతృప్తి పరుస్తున్నాయి.