రాష్ట్రంలో అతి పెద్ద నగరాలను లెక్క తీస్తే మొదట విశాఖ..తర్వాత విజయవాడ ఉంటుంది. రాష్ట్రం మధ్యలో ఉన్న విజయవాడ వ్యాపార కేంద్రంగా ఉంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్నా ఏవో అడ్డంకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నా ముందుకు సాగడం లేదు.
రెండు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఏ ప్రభుత్వం వచ్చినా కార్యరూపం దాల్చడం లేదు. 2019లో 45 సమీప గ్రామ పంచాయతీలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్ , గన్నవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాలను కవర్ చేస్తుంది. అయితే ప్రజాభిప్రాయసేకరణ, రాజకీయ కారణాలతో ముందుకు పడలేదు.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానురు, యనమలకుదురు, పొరంకి, తాడిగడప, ఎనికెపాడు, ప్రసాదంపాడు వంటి సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఈ గ్రామాలు నగరంలో భాగంగా మారి చాలా కాలం అయ్యాయి. అయినా వీటిని విలీనం చేయడం ద్వారా సానిటేషన్, తాగునీరు, ఇతర పౌర సౌకర్యాలను మెరుగుపరచవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
ఇటీవి కాలంలో విజయవాడకు ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 61.88 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. గ్రేటర్ విజయవాడగా మారితే, ఇది 300-403 చ.కి.మీ.కి విస్తరించవచ్చని అంచనా. ఈ విస్తరణతో నగరం రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుతుంది. ఓ మెట్రో సిటీగా రూపొందడానికి మొదటి అడుగు పడుతుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం ఏళ్లకేళ్లుగా కొనసాగుతోంది.