ప్రిలాంచ్ ఆఫర్లు అంటే ఆశపడిన వారిని నిలువు దోపిడీ చేసిన సంస్థ భువనతేజ. ఈ సంస్థపై ఈడీ దాడులు చేసింది. గతంలో కేసులయ్యాయి. ఎన్ని చేసినా డబ్బులు కట్టిన వారికి తిరిగి వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన పెంచుకోవడమే ముఖ్యం.
భువన తేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ యాజమాన్యం గత మూడేళ్లుగా “హ్యాపీ హోమ్స్ ఫేజ్-1, ఫేజ్-2”, “భువన తేజ్ ఆరా” పేరుతో ప్రీ-లాంచ్ ఆఫర్లు ప్రకటించి కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో అడ్వాన్సులు వసూలు చేసింది. మొత్తం రూ.80 కోట్లకు పైగా డబ్బు సేకరించినా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. యజమాని కస్టమర్లతో ఒప్పందాలు చేసి లక్షలు, కోట్లల్లో డబ్బు తీసుకుని వ్యక్తిగత ఖర్చులకు, ఇతర వ్యాపారాలకు మళ్లించుకున్నారు.
ఈ సంస్థ మోసంపై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 2024లోనే చీటింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత బాధితులంతా వెల్లువలా బయటకు వచ్చారు. నమ్మిన ప్రతి ఒక్కరిని ఈ సంస్థ మోసం చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. “కస్టమర్ల డబ్బు ఎక్కడికి మళ్లించారు? ఎవరికి లాభం జరిగింది?” అన్నదే ఇప్పుడు ఈడీ ప్రధాన దృష్టి పెట్టింది. గతంలో సాహితి లాంటి సంస్థలు చేసిన మోసాలతో వందల మంది సర్వం కోల్పోయారు.
ప్రిలాంచ్ ఆఫర్లు అంటేనే మోసం అనే సంగతిని గుర్తుంచుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే తక్కువ ధర అని గుడ్డిగా ఇల్లు బుక్ చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి.


