రాజకీయాల్లో క్రెడిట్ కోసం పాకులాడటం కామనే కానీ వైసీపీ తీరు చూస్తూంటే అందరూ నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదా అని ఆశ్చర్యపోవాలి. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన జరిగితే, అది తామే తెచ్చామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది.
గూగుల్ సంస్థ స్వయంగా ప్రకటన విడుదల చేసి, తామే లక్షన్నర కోట్ల పెట్టుబడితో ఏఐ హబ్ కడుతున్నామని స్పష్టంగా చెప్పినా, వైసీపీ మాత్రం కాదు కాదు.. అది అదానీ డేటా సెంటర్, దాన్ని జగనే తెచ్చారు అంటూ పాత రికార్డును ప్లే చేస్తోంది. పాపం గూగుల్ వాళ్లకే తెలియదు తాము అదానీ షెడ్డులో అద్దెకు ఉంటున్నామని! ఒక గ్లోబల్ టెక్ దిగ్గజం తమ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిని పెడుతున్నప్పుడు, దానికి కూడా పాత స్టిక్కర్లు వేయాలని చూడటం చూస్తుంటే, వైసీపీ నేతల క్రెడిట్ ఆకలి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే.. ఒకవేళ అది వైసీపీ చెబుతున్నట్లు అదానీ ప్రాజెక్టే అయితే శంకుస్థాపనకు గౌతమ్ అదానీనో లేక ఆయన ఫ్యామిలీ నుంచో కనీసం ఒకరైనా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి కదా? గూగుల్ ప్రతినిధులు వచ్చి శంకుస్థాపన చేస్తుంటే, అదానీ ఫోటోలు పట్టుకుని తిరగడం ఏ రకమైన తెలివితేటలో జగన్ రెడ్డి కే తెలియాలి. లోకం మొత్తం వేగంగా మారిపోతుంటే, వీళ్లు మాత్రం ఇంకా అన్నీ మా వల్లే జరిగాయి అనే భ్రమల్లోనే బతికేస్తున్నారు.
వైసీపీ నేతలను బయటి వారు ఎవరూ కామెడీ చేయాల్సిన పని లేదు, వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పెద్ద కామెడీ షో రన్ చేస్తున్నారు. పెట్టుబడి పెట్టేది గూగుల్, శంకుస్థాపన చేసింది చంద్రబాబు, కానీ సంతకం మాత్రం జగన్ దేనని వాదించడం వినడానికే వింతగా ఉంటుంది. ఆఖరికి గూగుల్ సెర్చ్ ఇంజన్లో కూడా జగన్ తెచ్చిన గూగుల్ హబ్ అని వెతికితే రిజల్ట్స్ నాట్ ఫౌండ్ అనే వస్తుందేమో కానీ, ఈ నేతల పట్టుదల మాత్రం తగ్గడం లేదు.
విశాఖకు వచ్చిన ఈ భారీ పెట్టుబడిని చూసి సంతోషించాల్సింది పోయి, ఇలాంటి వితండవాదాలతో బుక్కైపోవడం వైసీపీకే చెల్లింది. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందో లేదో కానీ, నవ్వుల పాలు మాత్రం అవుతారని ఈ గూగుల్ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది.
