వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంలో చక్రం తిప్పిన కీలక నేతల భవితవ్యం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారంతా ఇప్పుడు వరుసగా జైలు బాట పడుతుంటే, తెర వెనుక అసలు సూత్రధారులుగా భావిస్తున్న వారు మాత్రం సురక్షితంగా ఉంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఒక రకమైన బూతు సంస్కృతిని అలవాటు చేశారనే విమర్శలు ఎదుర్కొన్న సజ్జల భార్గవ్ రెడ్డి, ఇప్పుడు తనపై వస్తున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా తెర వెనక్కి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ, విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు చేయించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే, అధికారం పోయాక తన కుమారుడిని ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కోసం పనిచేసి ఇబ్బందుల్లో పడ్డ ఇతరులను మాత్రం కాపాడటం లేదు.
సజ్జల చెప్పినట్లుగా చేసిన పూడి శ్రీహరి ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుని జైలుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించకపోవడంతో, ఆయన అరెస్టు అనివార్యమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో బూతులు తిట్టిన వారు, పోస్టులు పెట్టిన వందలాది మంది కార్యకర్తలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే, వారికి మార్గదర్శకత్వం వహించిన పెద్దలు మాత్రం తమ పిల్లలను కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారిని వాడుకుని, అవసరం తీరాక వారిని వదిలేయడం వైసీపీ అగ్రనేతలకు అలవాటుగా మారిందనే అసంతృప్తి క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీహరి వంటి కీలక వ్యక్తులు బలైపోతున్నా, పార్టీ పరంగా గట్టి అండదండలు లభించడం లేదని, కేవలం రాజకీయంగా సింపతీ పొందడానికి వారి అరెస్టులను వాడుకోవడమే తప్ప, వారిని కాపాడాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. తన కుమారుడు భార్గవ్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా అడ్డుకోగలిగిన సజ్జల, అదే స్థాయిలో శ్రీహరిని ఎందుకు కాపాడలేకపోయారనేది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం.
