ఇప్పుడు ప్రజల జీవనశైలి మారిపోతోంది. చాలా మంది ఎత్తైన అపార్టుమెంట్లలో ఉండటం లగ్జరీ అనుకుంటున్నారు. కానీ ఆ లైఫ్ అందరికీ సెట్టవుతుందని చెప్పలేం. హైరైజ్ అపార్ట్మెంట్లు , ఇండిపెండెంట్ హౌస్‌ల మధ్య ఎంపిక అనేది పూర్తిగా వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలి , బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. హైరైజ్ అపార్ట్మెంట్లలో నివసించడం వల్ల లభించే అతిపెద్ద ప్రయోజనం భద్రత, సౌకర్యాలు. పదిహేను, ఇరవై అంతస్తుల పైన నివసించే వారికి ఆకాశంలో ఉంటున్న ఫీలింగ్ ఉంటుంది.
అయితే, హైరైజ్ అపార్ట్మెంట్లలో గోప్యత , స్వేచ్ఛ కొంత పరిమితంగా ఉంటుంది. మనం చేసే చిన్న మార్పుకైనా అసోసియేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే నెలవారీ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారంగా అనిపించవచ్చు. మరోవైపు, ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాలో నివసించడం వల్ల సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. ఇంటిని మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడం, సొంతంగా గార్డెనింగ్ చేసుకోవడం, భవిష్యత్తులో అదనపు అంతస్తులు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. క్కడ మన సొంత స్థలంపై పూర్తి హక్కు ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిర్వహణ పరంగా చూస్తే, అపార్ట్మెంట్లలో సామూహిక నిర్వహణ ఉంటుంది కాబట్టి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి చిన్న చిన్న సమస్యలను అసోసియేషన్ చూసుకుంటుంది. కానీ ఇండిపెండెంట్ హౌస్‌లో ప్రతీ చిన్న పనిని యజమాని స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. భద్రతకు సంబంధించి కూడా సొంతంగా గార్డులను నియమించుకోవడమో లేదా అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడమో చేయాలి.
ఆధునిక హంగులు, భద్రత, కమ్యూనిటీ లివింగ్ కోరుకునే వారికి హైరైజ్ అపార్ట్మెంట్లు ఉత్తమమైనవి. కాలుష్యం తక్కువగా ఉండి, పిల్లలు ఆడుకోవడానికి సురక్షితమైన ప్రదేశం కావాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. అలా కాకుండా, సంపూర్ణ స్వేచ్ఛ, గోప్యత , భూమిపై హక్కు కావాలనుకునే వారికి, నిర్వహణ బాధ్యతలను మోయగలిగేవారికి ఇండిపెండెంట్ హౌస్ సరైన ఎంపిక.
