కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల గడువు ముగిసింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 19, ఒంటిమిట్ట స్థానానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలా నామినేషన్లు దాఖలు కావడం విచిత్రం ఏమీ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీకి అందరికీ అవకాశం ఉంటుంది. కానీ అసలు నామినేషన్లు వేయడానికి అవకాశం దొరకని భయంకరమైన అప్రజాస్వామికమైన పాలన చూసి వచ్చారు కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కూడా చాలా మంది గొప్పగా చెప్పుకునేలా మారింది.
2021లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పుడు జగన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో కడపలో జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం కడప జడ్పీలో 52 స్థానాలు ఉన్నాయి. అందులో ఎన్ని ఏకగ్రీవమయ్యాయో గుర్తు చేసుకుంటే వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 49 జడ్పీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు ఒక్క పులివెందులలోనే 19 మంది పోటీ చేయడానికి ముందుకు వస్తే అప్పుడు జిల్లా మొత్తం మూడు చోట్ల తప్ప ఎక్కడా పోటీ చేయడానికి ఎవరూ సాహసించలేకపోయారు.
సిద్ధవటం, చింతకొమ్మదిన్నె, రాజంపేట స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు నిలబడ్డారు. ఫ్యాక్షన్ లీడర్లు ఓ చోట రిగ్గింగ్ చేసుకోవాలంటే.. వెయ్యి ఓట్లు ఉంటే.. 950 ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటారు. 10 ఓట్లు ఇతర పార్టీలకు వేస్తారు. మిగతావి వదిలేస్తారు. ఎందుకంటే… ఎన్నికలు జరిగాయని అనిపించుకోవడానికి. స్థానిక ఎన్నికలు కూడా గతంలో అదేవిధంగా జరిగాయి. కడపలో జగన్ రెడ్డి , వైసీపీ నేతలు పాలెగాళ్ల రాజ్యాంగం నడిపారు. ఏ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోయింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారికి ప్రజలు తమ ఓటు బలంతో అదే విధంగా బుద్ది చెప్పారు.
అప్పట్లో ప్రజలకు ఓటు వేసే అవకాశం లేకుండా చేసి.. అందర్నీ బెదిరించి ఏకగ్రీవం చేసుకున్న పార్టీలే.. ఇప్పుడు తమకు ఓటు వేయాలని ప్రజల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ప్రజాస్వామ్య గొప్పతనం.