తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరు లో ఓపెన్ ప్లాట్ల వేలం నిర్వహిస్తోంది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కోసం నిధుల సేకరణ లక్ష్యంతో ఈ స్థలాలను వేలం వేస్తున్నారు. తొర్రూరులో 100 ఓపెన్ ప్లాట్లు వేలానికి పెట్టారు. ప్లాట్ల పరిమాణం 100 నుండి 500 చదరపు గజాల వరకు ఉంటుంది. వేలం కోసం నిర్ణయించిన ప్రారంభ ధరలు మార్కెట్ ధర కంటే తక్కువగా ఉన్నాయి, ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంది. గజం ధను రూ. 25వేలుగా నిర్ణయించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా అంత తక్కువకు స్థలాలు లేవు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆస్తుల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కోసం కనీసం రూ. 2,000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టపరమైన సమస్యలు లేని ఆస్తులు మాత్రమే వేలం వేస్తున్నారు. రాజీవ్ స్వగృహ స్కీమ్ లో అపార్టుమెంట్లను నిర్మించారు. అలాగే ఓపెన్ ప్లాట్లను కూడా అభివృద్ధి చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన గృహాలను అందించే లక్ష్యంతో అభివృద్ధి చేశారు. వివిధ కారణాలతో చాలా ప్లాట్లు అమ్ముడుపోలేదు. ఇప్పుడు ఆ స్థలాల చుట్టూ అభివృద్ధి జరిగింది. కాలనీలు వెలిశాయి.
తొర్రూరుతో పాటు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లాలోని చందానగర్ (3 ప్లాట్లు), బహదూర్‌పల్లి (69 ప్లాట్లు) వంటి ప్రాంతాల్లో కూడా ప్లాట్లను వేలం వేస్తోంది. బహదూర్ పల్లిలో వేలం గడువు ముగిసింది. . రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వద్ద 1,342 ఓపెన్ ప్లాట్లు సుమారు 350 ఎకరాలలో ఉన్నాయి. ఎనిమిది దశల్లో జరిగిన వేలాల్లో 2,956 ఫ్లాట్లు, 3,444 ప్లాట్లు అమ్ముడుపోయాయి. తొర్రూరులోని ప్లాట్ల అప్సెట్ ధరలు మార్కెట్ ధర కంటే తక్కువగా ఉన్నందున, ఇవి పెట్టుబడిదారులకు, మధ్యతరగతి కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడ కొనే ఉద్దేశం ఉన్న వారు ఓ సారి ప్రయత్నించవచ్చు. తాజా వేలం వివరాలు , దరఖాస్తు ప్రక్రియ కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను www.swagruha.telangana.gov.in చూడవచ్చు.