“ తనకు కూడా ప్రత్యామ్నాయం చూపించేవాడే అసలైన నాయకుడు”
కౌటిల్యుడు చెప్పిన ఈ కొటేషన్ కార్పొరేట్ కంపెనీల సమావేశాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కోకుండా ముందుకు సాగాలంటే వ్యవస్థ నిర్మాణం అంత పకడ్బందీగా ఉండాలని కౌటిల్యుడు చెప్పాడు. ఇది వ్యాపారానికే కాదు. అన్ని వ్యవస్థలకూ వర్తిస్తుంది. ఓ కంపెనీలో కీలక పొజిషన్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా రాజీనామా చేయడమో, మరో కారణంతోనే విధులకు దూరమైతే.. ఆ కంపెనీ కుప్పకూలిపోయే పరిస్థితికి వస్తే.. ఆ సంస్థ పునాదులు ఏ మాత్రం బలంగా ఉన్నట్లుగా కాదు. ఆ వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనప్పటికీ తాను లేకపోతే సంస్థను నిర్వహించగలిగే నాయకత్వాన్ని తయారు చేయలేకపోయాడు కాబట్టి ఖచ్చితంగా విఫలనాయకుడే అవుతాడు. అది రాజకీయాలకూ వర్తిస్తుంది. తనకు కూడా ప్రత్యామ్నాయాన్ని ప్రతి రాజకీయ నేత .. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న వారు తయారు చేయాలి. సిద్ధం చేయాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ నాయకత్వ లోపం లేకుండా ఉంటుంది.
నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం ఎవరు ?
ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. ఈ సెప్టెంబర్ 17వ తేదీన మోదీ 75వ పడిలోకి అడుగుపెడతారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న అప్రకటిత రూల్ ప్రకారం 75 ఏళ్ల వరకే రాజకీయాలు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలి. ఈ నిబంధన చూపిస్తూ అద్వానీ దగ్గర నుంచి ఉమా భారతి వరకూ చాలా మందికి రిటైర్మెంట్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ముందుగానే వెంకయ్య నాయుడి చేతా రాజకీయ విరమణ చేయించారు. అందుకే ఇప్పుడు ప్రధాని మోదీ 75 ఏళ్ల నిబంధనకు కట్టుబడి ఉంటారా అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రశ్నలు బీజేపీ నుంచి కాదు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. బీజేపీ అంతర్గత అంశంపై ఇతర పార్టీలకు చెందిన వారు ప్రశ్నించడం పెద్దగా ప్రభావం చూపించదు. ఎందుకంటే 75 ఏళ్ల రిటైర్మెంట్ అనేది బీజేపీ రాజ్యాంగంలో కూడా లేదు. బీజేపీలో ఎవరూ మాట్లాడటం లేదు కాబట్టి.. మోదీ రిటైర్మెంట్ అనే ప్రశ్నే రాదు. కానీ అన్యాపదేశంగా అన్నారో.. ఉద్దేశపూర్వకంగా అన్నారో కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ “ 75 ఏళ్లు దాటాయని ఎవరైనా శాలువాతో సన్మానిస్తే .. అది ఇక సేవలు చాలు అన్న సంకేతం” అని ఓ కార్యక్రమంలో అన్నారు. ఇది మోదీని ఉద్దేశించే అని విపక్షాలు స్పందించడం ప్రారంభించాయి. ఈ చర్చ దేశంలో ఓ కొత్త సందేహానికి తావిచ్చింది. అదేమిటంటే.. మోదీ కాకపోతే ఇంకెవరు?
మరో మోదీ స్థాయి నేతను బీజేపీలో ఎదగనివ్వని వైనం
ప్రధానమంత్రి అంటే నరేంద్రమోదీ అనే భావన ప్రజల మస్తిష్కాల్లో స్థిరపడిపోయింది. ప్రధానిగా మోదీ కాకపోతే ఇంకెవరు అన్న సందేహం ఇప్పటి వరకూ చాలా మందికి రాలేదు. ఏ అభిప్రాయసేకరణ చూసినా ప్రధానిగా మోదీనే యాభై శాతానికన్నా ఎక్కువగా ప్రజలు భావిస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా మోదీ స్థాయి నేత సమీపంలో లేరు. ఆయనకు ప్రత్యామ్నాయం బీజేపీలో దాదాపుగా లేదు. మోదీ తర్వాత స్థానంలో అమిత్ షా ఉంటారు. కానీ మోదీకి ఉన్నంత సానుకూలత అయితే రాదు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వస్తాయి. కానీ వీరెవరూ.. మోదీ స్థాయి నాయకత్వాన్ని ఇస్తారని అనుకోలేరు. 2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఇలాంటి నాయకత్వ సంక్షోమే ఎదుర్కొంది. పదేళ్ల యూపీఏ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని స్పష్టమయింది. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఓట్ల రూపంలో పొంది ఢిల్లీలో జెండా ఎగురవేయాలంటే.. ఆ పార్టీ తరపున దేశానికి నాయకత్వం వహించేది ఎవరు? అన్న ప్రశ్న వచ్చింది. అప్పటికే వాజపేయి అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యాయి. అద్వానీ ఉన్నా ఆయన అందరికీ ఆమోదయోగ్యుడు కాలేకపోయారు. అదే సమయంలో ఆయన వయసు కూడా పైబడింది. అప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులకు తమకు అద్వానీని మించిన బలమైన నాయకుడు కావాలని కోరుకున్నారు. అలా నరేంద్రమోదీ తెరపైకి వచ్చారు. అప్పటికి మోదీకి వివాదాస్పద నేపధ్యం ఉంది. గోధ్రా వంటి ఘటనలతో ఆయన రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేశారన్నది విమర్శలు ఉన్నాయి. . ఆయన ప్రయాణానికి అమెరికా లాంటి దేశాలు వీసాలు ఇవ్వడానికి నిరాకరించేవి. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆయన పర్యటనలను వ్యతిరేకించే స్థాయిలో ఉండేవి. కానీ వాటన్నింటికీ మించి ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ కావడానికి ఆయనకు సహాయపడింది గుజరాత్ మోడల్ అభివృద్ధి. గుజరాత్ మోడల్ అభివృద్ధిని దేశవ్యాపితం చేస్తారన్న గట్టి నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ అయితే తిరుగులేని విజయం లభిస్తుందని అంచనాలు వచ్చాయి. దీంతో బీజేపీ అగ్రనాయకులు కూడా అంగీకరించక తప్పలేదు. నేరుగా అహ్మదాబాద్ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఢిల్లీలో అడుగు పెట్టారు మోదీ. ఇక అక్కడి నుంచి జరుగుతున్నది ఓ చరిత్ర.
మర్రి చెట్టు నీడన ఎదగని మరో వృక్షం
మూడో సారి గెలిచినా అప్పట్లో తనకు వచ్చిన ప్రజాదరణ ఏ మాత్రం కోల్పోకుండా రాజకీయాలు చేస్తున్న నేత ప్రధాని మోదీ. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలలో ఆయన నాయకత్వంలో BJP విజయాలు సాధించింది. ఆయన వ్యక్తిగత ఆకర్షణ, బలమైన రాజకీయ వ్యూహం, జనసామాన్యంతో సంబంధం కలిగి ఉండే సామర్థ్యం తిరుగులేని నేతగా నిలబెట్టాయి. ఆయన నాయకత్వం ఎంత స్థాయికి వెళ్లిందంటే.. రిటైర్మెంట్ తీసుకుంటే, ఆయన స్థాయి జాతీయ ఆకర్షణ మరియు ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురాగల నాయకుడు ప్రస్తుతం BJPలో స్పష్టంగా కనిపించడం లేదు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిస్వా శర్మ వంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వీరిలో ఎవరూ మోదీ స్థాయి జాతీయ గుర్తింపు లేదా ఓటర్లను ఆకర్షించే స్థాయి నాయకులని అనుకోవడంలేదు. మోదీ తర్వాత నెంబర్ 2గా ఉండే అమిత్ షా రాజకీయ వ్యూహకర్తగా బలమైన నాయకుడు కానీ, ఆయనకు మోదీ స్థాయి జనాదరణ లేదు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ కే పరిమితమైన నేత. ఆయనను అలా చేశారని బీజేపీలో విమర్శలు ఉండవచ్చు కానీ.. ఆయన ప్రభావం దేశవ్యాప్తం కాలేదు. ఎలా చూసినా మోదీకి తగిన నాయకుడు బీజేపీలో రెడీ కాలేదు. ప్రధాని మోదీ తనకు ప్రత్యామ్నాయాన్ని రెడీ చేయలేకపోయారు. ఇది కళ్ల ఎదురుగా కనిపిస్తున్న నిజం. మోదీనే బీజేపీ అనే పరిస్థితి వచ్చిందన్నది కూడా తోసిపుచ్చలేని వాస్తవం. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే “ మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావు” అని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టి చెప్పారు. దీన్ని బీజేపీ నేతలే కాదు ఎవరూ ఖండించలేరు. నిజానికి బీజేపీ దేశవ్యాప్తంగా బలోపేతం అయింది. సంస్థాగత నిర్మాణం అత్యంత పటిష్టంగా ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బలమైన ఆలోచనాపరమైన మద్దతును అందిస్తుంది. కానీ ఓ వ్యవస్థ నిలబడాలంటే.. నాయకుడు అత్యంత సమర్థుడు, శక్తివంతుడై ఉండాలి. అలాంటి నాయకత్వం ఉంటే వ్యవస్థ అంతా సాఫీగా సాగుతుంది. బీజేపీకి ఇలా విజయాలు వస్తున్నాయంటే దానికి కారణంగా మోదీనే. మోదీ నాయకత్వమే. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ చాలా పరిమితంగా సీట్లు గెలుస్తుంది. అదే పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరిగితే.. తిరుగులేని ఆధిక్యం చూపిస్తుంది. ఇక్కడ మోదీ నాయకత్వం అన్నదే ఓటింగ్ లో ప్రభావం చూపిస్తుంది. అలాంటి నాయకత్వం ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా అత్యవసరం.
విపక్షాల్లోనూ మోదీకి ధీటైన నేత లేరు – నిరూపించుకోలే్కపోతున్న రాహుల్
ఇప్పటికిప్పుడు మోదీ రిటైర్మెంట్ కావాలని కోరుకునేది ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు మాత్రమే. దేశ ప్రజలు మోదీ రిటైర్మెంట్ కావాలని కోరుకోరు. ఎన్డీఏ ముఖ్యమైన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ .. మోదీని సరైన సమయంలో ఉన్న సరైన నాయకునిగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బలమైన నాయకుడు దేశాన్ని నడిపించాల్సిన అవసరం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. రాజకీయ అనిశ్చితుల వల్ల సమస్యలు వస్తాయి. అందుకే ప్రధాని మోదీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు అందరికీ మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న మాత్రం మదిలో ప్రారంభమయింది. ప్రజలు మరింత విస్తృతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. బీజేపీ నేతల ఆలోచనలు.. తర్వాత నాయకత్వం ఎవరు అన్నది ఆ పార్టీ వరకే పరిమితం అవుతుంది కానీ.. ప్రజల ఆలోచనలు దేశం గురించి ఉంటాయి.. మోదీ తర్వాత ఎవరు అన్నది వారు అన్ని పార్టీల నేతల్లోనూ వెదుక్కుంటారు. ఇలా కూడా ప్రజలకు ప్రత్యామ్నాయం దొరక్కపోతే అది విపక్షాల చేతకానితనం అనుకోవాలి. ప్రధానిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే సపోర్టు లేదు. రాహుల్ ను ప్రధానిగా అంగీకరించడానికి చాలా మమతా బెనర్జీ లాంటి చాలా మంది నేతలు వ్యతిరేకంగా ఉంటారు. తాను బలమైన నాయకుడ్నే అని నిరూపించుకునే విషయంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఇక్కడ ఆయనకు వస్తున్న వ్యతిరేకతనే నిరూపిస్తోంది. కానీ మోదీకి ఎదురుగా ప్రత్యామ్నాయంగా ఆయనే కనిపిస్తున్నారు. కానీ ఐడియాలాజికల్ సమస్యలు, దేశానికి అవసరం లేని కుల, మత గొడవలు నెత్తికెత్తికుని బీజేపీ ట్రాప్ లో పడిన ఆయన కిందా మీదా పడుతున్నారు. మోదీ కన్నా మెరుగైన పాలన అందిస్తానని నిరూపించలేకపోతున్నారు. అక్కడ కూడా నాయకత్వ సంక్షోభం ఉండటం ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తోంది. కానీ దేశానికి ప్రత్యమ్నాయ నేత కరవయ్యారన్న ఆందోళన పెంచుతోంది. అంటే.. ప్రధాని మోదీ కనీసం బీజేపీ నుంచి అయినా తన తర్వాత ఎవరు అన్న స్థాయిలో నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోక తప్పదు.
మోదీ స్వయంగా తప్పుకుంటే తప్ప నో రిటైర్మెంట్
“ మోదీ స్వయంగా తప్పుకుంటే తప్ప బీజేపీలో నాయకత్వ మార్పు అనే అంశం తెరపైకి రాదు” అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మోహిసినా కిద్వాయ్ తేల్చిచెప్పారు. ఇందులో ఒక్కశాతం కూడా డౌట్ లేదు. మోదీ ఇక తాను రిటైర్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు మాత్రమే నాయకత్వ మార్పు చర్చకు వస్తుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఈ అంశంపై మరో చర్చ ఉండదు. ఈ లోపే ప్రధాని మోదీ తన స్థాయి నాయకత్వాన్ని బీజేపీ నుంచే దేశానికి అందించేలా చేయాల్సి ఉంది. కనీసం విపక్షాల నుంచి అయినా మోదీ రిటైర్మెంట్ తీసుకున్నా దేశ బలమైన నాయకత్వానికి ఢోకా ఉండదని ప్రజలకు నమ్మకం కలిగించే నాయకత్వాన్ని రెడీ చేసుకోవాలి. ఇదే 2029 ఎన్నికల్లో నాయకత్వమే ప్రధాన అంశం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.