ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని బండి సంజయ్ లైట్ తీసుకున్నారు. తాను తప్పు చెప్పాను అని అనుకున్నట్లయితే కుటుంబంతో సహా వచ్చి దేవుని వద్ద ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. తాను కూడా తన కుటుంబంతో వస్తానన్నారు. సిట్ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలు, ఎస్ఐబీ అధికారులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలనే తాను చెప్పానన్నారు. వారు గతంలో తనపై చేసిన వ్యాఖ్యలకు తాను నోటీసులు ఇవ్వాలనుకుంటే జీవితాంతం జైల్లోనే ఉంటానని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో రాఖీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
తన ఫోన్ను ట్యాప్ చేశారని కవిత చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. మరి కవితకు ఇస్తావా నోటీసులు అని కేటీఆర్ పై మండిపడ్డారు. సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన వారందరికీ నోటీసులు ఇస్తావా అని మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం కంటే మూర్ఖత్వం లేదని ఎద్దేవా చేశారు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చినోడినని కేటీఆర్కు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలన్నారు. ఎందుకంటే ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. అయినా మీరు ఇంకా ఎట్లా బీఆర్ఎస్ లో ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తిగా కేంద్ర సంస్థలు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశమని అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేసి రెండు రోజులు గడువు ఇచ్చారు. పట్టించుకునేది లేదని బండి సంజయ్ చెప్పడంతో తదుపరి కేటీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.