”తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు. మేము కో-స్టార్స్‌గా జర్నీ మొదలు పెట్టాము. రియల్ లైఫ్‌లో బ్రదర్స్ అయ్యాం. మీరందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీ అభిమానం నా బ్రదర్ మీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి. ఎందుకంటే తను మీ అందరి అభిమానానికి అర్హుడు’ అన్నారు హృతిక్ రోషన్. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ”అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు” అని ఆయన తెలుగులో స్పీచ్ ప్రారంభించడం అభిమానుల్ని ఆకట్టుకుంది.
‘క్రిష్, ధూమ్, కహో నా ప్యార్ హే… ఇలా నా చిత్రాల్ని ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సినిమానీ కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. నేను టైగర్ ఫ్యాన్స్ గర్జనని వినాలనుకుంటున్నాను. వార్ 2 మరో నాలుగు రోజుల్లో మీ ముందుకు రాబోతుంది. యుద్ధానికి రెడీనా” అన్నారు.
”టైగర్‌కి ఎదురుగా నిలబడి నటించడం ఒక మరపురాని అనుభూతి. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాము. గాయాలు కూడా అయ్యాయి. తారక్ చాలా స్ట్రాంగ్. ఆయనకి గాయాలైనా నొప్పిని ఫీలయ్యేవారు కాదు. ఆయన్ని చూసి నేనూ పరిగెత్తేవాడిని. ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. షూటింగ్లో గాయాలు అయినప్పుడు నొప్పి అనిపించింది. కానీ ఇప్పుడు మీ అందరి ప్రేమను చూస్తుంటే ఆ నొప్పి మాయమైపోయింది.
తారక్ వన్ టేక్, ఫైనల్ టేక్ స్టార్. తారక్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక షాట్‌కి 100% ఎలా ఇవ్వాలో తన దగ్గర తెలుసుకున్నాను. తను ఒక షాట్ చేసిన తర్వాత మళ్లీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దానికి కావలసిన ఎఫర్ట్ అంత పక్కాగా పెడతారు. అది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. అది నా ఫ్యూచర్ ఫిల్మ్స్‌కి అప్లై చేస్తాను.
తారక్ అద్భుతమైన వంటగాడు. తారక్, నేను కలిసి భవిష్యత్తులో సినిమాలో చేస్తామో లేదో తెలియదు కానీ తను చేసే బిర్యానీ మాత్రం ఎప్పుడూ రుచి చూస్తూనే ఉంటాను. ఇది లైఫ్ లాంగ్ ప్రామిస్’ అన్నారు హృతిక్.