ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సలహాల సునామీ చుట్టుముడుతోంది. ముఖం కూడా చూపించుకోవడానికి భయపడే సోషల్ మీడియాలో వీర అభిమానిని అని చెప్పుకునే వారి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వరకూ అందరూ సలహాల మీద సలహాలు పడేస్తున్నారు. దారి తప్పుతున్నారని హెచ్చరిస్తున్నారు. పథకాలు కరెక్ట్ కాదంటున్నారు. ఇలా కాదు.. అలా చేయాలంటున్నారు. వీరందర్నీ పట్టించుకునే తీరిక చంద్రబాబుకు ఉందో లేదో కానీ ఈ సలహాలు మాత్రం ఆగడం లేదు.
అసలు ప్రయత్నమే చేయకుండా ఆపడం ఎందుకు ?
చంద్రబాబు పీ ఫోర్ అనే తన ఆలోచన గురించి ఎన్నికలకు ముందే చెప్పారు. పేదరికంపై పోరాటం చేస్తానన్నారు. సేవాగుణం ఉన్న వారితో పేదల్ని బాగు చేయించి.. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకు వస్తానని చెప్పారు. అది ఆయన ఆలోచన. ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు. ఎన్నికల సమయంలో చెప్పారు కాబట్టి.. అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తన ఆలోచనలకు తగ్గట్లుగా అమలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాసెస్‌లో ఉంది. కానీ అమల్లో వచ్చే సవాళ్లు, సమస్యలను చూపించి.. ఇలా చేయండి మంచిది కాదనే కామెంట్లతో వచ్చేస్తున్నారు. అసలు ప్రారంభం కాకుండానే ఎందుకింత గోల చేస్తున్నారు..? ప్రారంభించిన పనిని మధ్యలో ఆపేయమని ఎందుకు అంటున్నారు?
అమరావతి నుంచి P4వరకూ అన్నిచోట్లా అంతే !
అయితే ఒక్క విషయంలోనే ఇలా జరుగుతుందనుకుంటే పొరపాటు. అన్ని అంశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. చివరికి అమరావతి విషయంలోనూ అంతే. ఓ ఘోరమైన సునామీ లాంటి ఉత్పాతాన్ని ఎదుర్కొన్న అమరావతిని మళ్లీ పట్టాలెక్కించడం అంత తేలిక కాదు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓ దారికి తీసుకు వచ్చారు. నిధుల సమస్య లేకుండా చూశారు. ఓ వైపు రాక్షసుల్లా అడ్డు పడుతున్నా.. వారిని పక్కకు తప్పించి.. పనులన్నీ ప్రారంభమయ్యేలా చేశారు. భూములకు విలువ పెంచడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. రెండో విడత భూసేకరణ చేసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రకటిస్తే.. మొదటి విడత సమీకరించిన భూములకు డిమాండ్ పెరుగుతుదంని ప్లాన్ చేస్తే..దానిపైనా విరుచుకుపడ్డారు. ఇప్పుడు రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వట్లేదని రచ్చ. ఎంత శ్రమిస్తున్నారో.. తెలిసి కూడా..ఇలా ప్రకటనలు చేయడం సలహాలు ప్రారంభించడం.. అసలైన స్వార్థం. అలా ఇవ్వడానికి జరుగుతున్న పనుల్ని ప్రజలకు చెప్పడం చేయవచ్చు కానీ.. అలా చేయడం లేదు.
అందరూ చెప్పేది వింటారు – అందుకే చంద్రబాబుకు చెబుతారు !
చంద్రబాబు అందరూ చెప్పేది వింటారు. నువ్వెవరు నాకు చెప్పడానికి అనే మనస్థత్వం ఆయనకు లేదు. అయితే తాను అనుకున్నదే చేస్తారు. ఇతరులు చెప్పిన దాంట్లో తాను చేయాలనుకున్నదానికి ఏదైనా మెరగైన అంశం ఉంటే తీసుకుంటారు. గతంలో ఇలా జరిగింది.. అలా జరిగిందని భయపెట్టి తమ సలహాలను పాటించాలని ఆయనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు కొందరు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే.. ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు నమ్ముతారు. ఫలితాల సంగతి తర్వాత ముందు ఎందుకు ప్రయత్నించనివ్వడం లేదన్నదే ఇక్కడ కీలక అంశం.