ఓటు చోరీ అంటూ రాహుల్ పోరాడుతున్నా ఏపీ గురించి మాట్లాడటం లేదని జగన్ రెడ్డి చేసిన విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. కథలు చెప్పవద్దని.. ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి మద్దతుగా పోరాటానికి రావాలని పిలుపునిచ్చింది. గురువారం విజయవాడలో ఓటు చోరీకి వ్యతిరేకంగా షర్మిల ర్యాలీ చేస్తున్నారని అందులో పాల్గొనాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని.. రాజకీయం కోసం కాదన్నారు. కేసుల కోసం అమిత్ షా ,మోదీకి సరెండర్ అయిపోయి రాహుల్ పై విమర్శలు చేయడం ఏమిటని.. జగన్ రెడ్డిలా రాహుల్ సరెండర్ కాలేదన్నారు.
తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ తీరుపై స్పందించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదన్నారు. ఏపీ ఎన్నికల్లో ఓట్ల చోరీ అక్రమాలు జరిగితే.. రాహుల్ తో కలిసి పోరాడాలన్నారు. ఎన్నికల్లో తప్పులు జరిగితే ఈసీ, మోదీ, షాను తప్పు పట్టాలి.. రాహుల్ ను కలిసి పోరాడుతున్న దానికి మద్దతు పలకాలి కానీ ఇలా మాట్లాడుతున్నారేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్న జగన్ రెడ్డి.. తన కోసం కాంగ్రెస్ పోరాడాలని అనుకుంటున్నారు. ఏపీలో అక్రమాలు జరిగాయని అంటున్న ఆయన మాత్రం మోదీ , ఈసీ, అమిత్ షాలపై ఒక్క మాట కూడా మాట్లాడరట. కానీ కాంగ్రెస్ మాత్రం మాత్రం పోరాడాలంటున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదని మాణిగంఠాగూర్ మీద జగన్ ఏడుస్తున్నారు. జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తీసుకుని పోయి బలపడ్డారు. ఆయనను బలహీనం చేస్తేనే కాంగ్రెస్ బలపడుతుంది. వారి రాజకీయం వారు చేస్తూంటే.. జగన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ పోరాడటం లేదని తన చేతకాని తనాన్ని బయట పెట్టుకుంటున్నారు.