బీహార్లో ఎన్డీఏ కూటమి ఎదురీదుతోందన్న ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ పాలనపై ప్రజలలో వ్యతిరేకత ఉందని.. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల పార్టీల వలన ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కూటమికి మేలు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలను రాజకీయంగా చేయాల్సిన రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ కొత్త రాజకీయం ప్రారంభించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో పాదయాత్ర కూడా ఆదివారం నుంచి చేస్తున్నారు.
అసలు ఈ అంశం .. నితీష్ పాలనపై నుంచి ప్రజల చర్చకు పక్కకు వెళ్లేలా చేస్తోంది. కాంగ్రెస్ కూటమి ట్రాక్ తప్పిన విషయాన్ని అర్థం చేసుకున్న నితీష్ కుమార్ .. బీహార్ ప్రజలను ఎలా ట్యూన్ చేయాలో అలా ట్యూన్ చేస్తున్నారు . వరుసగా పథకాలు ప్రకటిస్తున్నారు. పేదలు, యువతకు తాయిలాలు ఇస్తున్నారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మెజార్టీ బీహార్ ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో.. నితీష్ కుమార్ అలాగే చేస్తున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్.. అనారోగ్యం కారణంగా తెర వెనుక రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆయన కుమారుడు తేజస్వి మొత్తం పార్టీని నడిపిస్తున్నారు. ఆయన సమర్థుడిగానే పేరు తెచ్చుకున్నారు. కానీ రాహుల్ గాంధీ బీహార్ విషయంలో ఓటర్ల జాబితాల విషయాన్నే హైలెట్ చేయాలని చూడటంతో .. ఆయన పరిస్థితి కూడా తేడాగా మారిపోయింది. తేజస్వి ఓ సారి ఎన్నికల బహిష్కరణ చేస్తామని కూడా ప్రకటించి అభాసుపాలయ్యారు. ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారని కామెంట్లు ఎదుర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలను హైలెట్ చేయకుండా.. ఓటర్ల జాబితాలను హైలెట్ చేయడం సెల్ఫ్ గోల్ గా మారుతోంది. అర్హులైన ఓటర్లు ఎవరికీ ఓటు హక్కు లేకుండా పోదు. బూత్ల వారీగా చెక్ చేసుకునే వ్యవస్థలు ఉంటాయి. అయినా కాంగ్రెస్ చేస్తున్న రివర్స్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ కూటమి చేతిలోకి వచ్చిన విజయాన్ని కింద పడేసుకుంటుందేమో అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో అలాగే చేసుకున్నారు.