మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని మోదీ ఖరారు చేసే అభ్యర్థికి మద్దతు ఉంటుందని ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ఇవాళో..రేపో ప్రకటించనుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ 21. ఒక రోజు ముందుగానే ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్డీఏ నేతలు భేటీ ఉంటుంది. ఆ భేటీకి చంద్రబాబు, పవన్ హాజరవుతారు. అదే సమయంలో ఈ పర్యటనలో అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
నారా లోకేష్ కూడా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. నారా లోకేష్ ప్రత్యేకమైన పనుల మీద ఢిల్లీ వెళ్తున్నారు.