తిరుమలకు వెళ్తే సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచితమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఘాట్ రోడ్డుల్లో ఉచితం కాదని ఇంతకు ముందు నిబంధన పెట్టింది. అయితే ఇప్పుడు ఆ నిబంధన సడలించింది. ఉచిత ప్రయాణం అని పుణ్యక్షేత్రాల వద్దకు వెళ్తున్న భక్తలకు.. ఘాట్ రోడ్లలో డబ్బులు కట్టాల్సి వస్తుందన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రభుత్వం ఘాట్ రోడ్లలోనూ ఉచితమని ప్రకటించింది.
ఘాట్ రోడ్లు అంటే ముఖ్యంగా తిరుమలనే. తిరుపతి వరకూ ఆర్టీసీ బస్సులు వస్తాయి. తిరుపతి నుంచి తిరుమలపైకి సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సులు ఉంటాయి. వాటిలో కూడా ఉచితం చేశారు. అయితే.. సీటింగ్ కెపాసిటీ వరకు ప్రయాణికుల్ని ఎక్కించుకుంటారు. నిలబడాల్సి వస్తే మాత్రం భద్రత కారణంగా అనుమతించడం లేదు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిమాండ్ ను బట్టి అక్కడ బస్సుల్ని పెంచనున్నారు.
కేవలం ఏపీ మహిళలకు మాత్రమే ఉచితం. ఏపీకి సంబంధించిన గుర్తింపు కార్డు ఉంటనే ఉచితం. ఇతర రాష్ట్రాల వారు డబ్బులు చెల్లించి టిక్కెట్ తీసుకోవాలి. ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వచ్చేవారి కన్నా.. వ్యక్తిగత వాహనాలతో వచ్చే వారే పెరిగిపోతున్నారు. బస్సులు సీటింగ్ కెపాసిటీ నిండటం .. వారాంతాల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆక్యుపెన్సీ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.