బెంగళూరులో ఆఫీసు స్థలాలకు ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. బెంగళూరు శివారులోని పాతిక వేల కోట్లతో ఫాక్స్ కాన్ యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్ పెట్టింది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఇండియాలో యాపిల్ కార్యకలాపాలు విస్తరించేందుకు బెంగళూరులో భారీ భవంతిలో యాపిల్ 5వ నుండి 13వ అంతస్తుల వరకు తొమ్మిది అంతస్తులను అద్దెకు తీసుకుంది.
బెంగళూరులోని వసంత్ నగర్లో ఉన్న ఎంబసీ జెనిత్ భవనంలో 9 అంతస్తుల్లో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 1,010 కోట్లు. నెలవారీగా అద్దె రూ. 6.31 కోట్లు. అంటే చదరపు అడుగుకు రూ. 235. 362 కార్ పార్కింగులు మాత్రమే ఉంటాయి. ఈ లీజు 2025 ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయింది. అద్దెలో సంవత్సరానికి 4.5 శాతం పెరుగుదల ఉండేలా ఒప్పందం చేసుకున్నారు.
ఈ ఆఫీసులో యాపిల్ 1200 మంది ఉద్యోగుల్ని నియమించే అవకాశం ఉంది. అదనంగా, యాపిల్ గ్రౌండ్ నుండి 4వ అంతస్తు వరకు మరో 1.21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశం ఉంది. అంటే మరో రెండు మూడు వందల కోట్లు ఎక్కువే అవుతుంది. యాపిల్ ఇప్పటికే బెంగళూరు , హైదరాబాద్లో ఇంజనీరింగ్ టీమ్స్ ను కలిగి ఉంది. భారత్ లో కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది.