జులై 24న పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’గా థియేటర్లలో సందడి చేశారు. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోని కూడా దింపేశారు. అమేజాన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ వెర్షన్కీ, ఓటీటీ వెర్షన్కీ కొన్ని మార్పులు కనిపించాయి. థియేటర్లలో కొన్ని వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు సరిగా పండలేదు. వాటిపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఆ సన్నివేశాల్ని పూర్తిగా తొలగించారు. క్లైమాక్స్ లో తుఫాను ఫైట్ కూడా పూర్తిగా తీసేశారు. చౌకీ దార్ సన్నివేశంతోనే ఈ సినిమాని ఆపేశారు. పార్ట్ 2కి అక్కడ లీడ్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే కనీసం 15 నిమిషాల సన్నివేశాల్ని ట్రిమ్ చేశారు. ఇది ఓరకంగా మంచిదే అయ్యింది. సినిమా విడుదలైన నాలుగు రోజులకు ట్రిమ్ వెర్షన్ ఒకటి రెడీ చేశారు. కొన్ని థియేటర్ల వరకే ఆ వెర్షన్ పరిమితమైంది. ఇప్పుడు ఓటీటీకి అదే వెర్షన్ని కొన్ని మార్పులు జోడించి విడుదల చేశారు.
ఈమధ్య ఓటీటీ కోసం దర్శకులు కొత్త వెర్షన్ని కట్ చేస్తున్నారు. కొన్నిసార్లు సినిమా కోసం ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తిరించిన సీన్లని కూడా ఓటీటీలో కలుపుతున్నారు. చాలా సందర్భాల్లో థియేటర్లో కంటే ఓటీటీలోనే రన్ టైమ్ ఎక్కువ ఉంటోంది. ‘పుష్ప 2’ విషయంలో ఇదే జరిగింది. ‘డైరెక్టర్స్ కట్’ పేరుతో కొత్త సన్నివేశాల్ని జోడించడం వల్ల… ఓటీటీలో వ్యూవర్ షిప్ పెరుగుతోంది. `వీరమల్లు` విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. ”వీరమల్లు ఓటీటీలో చూసినవాళ్లకు ఇంకా బాగా నచ్చుతుంది. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ డిస్ కనెక్ట్ అయినా… ఆ తరవాత సినిమాని ఎంజాయ్ చేయలేం. ఓటీటీలో అలా కాదు. ఎలాంటి అంచనాలూ పెట్టుకోకుండా సినిమాని సినిమాలానే చూస్తారు. కాబట్టి వీరమల్లు.. ఓటీటీ ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది” అన్నారు దర్శకుడు జ్యోతికృష్ణ.