సీఎంలను సైతం అరెస్టు చేసి.. నేర నిరూపణ కాక ముందే పదవీచ్యుతులను చేసే బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అది రాజ్యాంగ విరుద్ధమని.. ఆందోళన చేసింది. అమిత్ షాపై పేపర్లు చింపి కాంగ్రెస్ ఎంపీలు విసిరేశారు. ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన బిల్లును.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మద్దతిచ్చారు. అందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని.. మంచి బిల్లు అని పార్లమెంట్ ముందు నిలబడి సమర్థించారు. రేపు సభలో చర్చ జరిగినా ఆయన అదే చెబుతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది.
ఇటీవలి కాలంలో శశిథరూర్ కు కాంగ్రెస్ తో సరిపడటం లేదు. ఆపరేషన్ సిందూర్ పై విదేశాలకు పంపిన టీముల్లో కాంగ్రెస్ తరపున శశిథరూర్ పేరును ప్రతిపాదించకపోయినా ఆయనను కేంద్రం అమెరికా పంపింది. శశిథరూర్ మాజీ దౌత్యవేత్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోసం పోటీ పడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కేంద్రం పంపించడంలో అర్థం ఉంది కానీ.. కాంగ్రెస్ తరపున .. ఆ పార్టీ ప్రతిపాదించకపోయినా పంపించడం విమర్శలకు కారణం అయింది. ఆ తర్వాత నుంచి శశిథరూర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
శశిథరూర్ పూర్తిగా పార్టీ స్టాండ్ నుంచి పక్కకు వెళ్లిపోయారని క్లారిటీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై చర్యలు తీసుకోవడం లేదు. ఆయన మాత్రం కాంగ్రెస్ ను ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతూనే ఉన్నారు. కేరళలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. అయినా శశిథరూర్ కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వద్దామనుకుంటున్నారో ఆయనకే తెలియాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.