వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టుకతో క్రైస్తవుడు. ఆయనకు నరనరాన క్రైస్తవత్వం ఉంది. ఆయన నోట తరచూ వచ్చే దేవుడు ఉన్నాడన్న మాట .. క్రీస్తు గురించే. అందులో తప్పు లేదు. ఎవరి మత విశ్వాసాలు వాళ్లవి. కానీ జగన్ ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. తాను క్రైస్తవుడ్నని చెప్పుకోవడంలేదు. అలాగని తాను హిందువునని కూడా చెప్పడం లేదు. కానీ హిందువునని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే అసలు తేడాకొడుతోంది. ఒక వ్యక్తికి తన మతంపై నమ్మకం ఉండటం, దానిని ఆచరించడం రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ గుర్తింపును దాస్తూ, మరో వర్గాన్ని మెప్పించేందుకు ప్రయత్నించడం వల్లే విమర్శలు తలెత్తుతున్నాయి.
జగన్ దేవుడు జీసస్
జగన్ రెడ్డి తన ప్రసంగాల్లో తరచూ దేవుడి దయ అని ప్రస్తావిస్తుంటారు. అది ఏ దేవుడో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ, ఎన్నికల సమయం వచ్చేసరికి , ఆలయాల సందర్శన సమయంలో ఆయన ప్రదర్శించే భక్తి వెనుక ఏదో తెలియని అపనమ్మకం కనిపిస్తుంది. తాను క్రైస్తవుడినని గర్వంగా చెప్పుకోలేకపోవడం వెనుక హిందూ ఓటు బ్యాంకు దూరం అవుతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి, ప్రజలు నాయకుడి నిజాయితీని గౌరవిస్తారు కానీ, ముసుగులో ఉన్న నమ్మకాలను కాదు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనేవి చాలా ముఖ్యం. తన సొంత మతాన్ని ధైర్యంగా ప్రకటించుకోలేని వ్యక్తి, ప్రజలకు ఇచ్చే హామీలపై నిలబడతారా అనే సందేహం సామాన్యుల్లో కలగడం సహజం. తమిళనాడులో విజయ్ వంటి నేతలు తమ మతాన్ని దాచుకోకుండానే రాజకీయం చేస్తున్నారు. జోసెఫ్ విజయ్గానే ప్రకటించుకున్నారు. అక్కడ లేని భయం, అభ్యంతరం ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఎందుకు ఉండాలి? తన అస్తిత్వాన్ని తానే తక్కువ చేసుకున్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటోంది.
హిందూ ఓటు బ్యాంకు రాజకీయం
హిందువుగా నటించడం ద్వారా ఆ ఓట్లను రాబట్టుకోవచ్చనేది జగన్ వేస్తున్న తప్పుడు అంచనా. భారతీయ ఓటర్లు మతం చూసి మాత్రమే ఓట్లు వేయరు. అభివృద్ధి, సంక్షేమం చూస్తారు. కానీ, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించినప్పుడు అసలుకే ఎసరు వస్తుంది. ఆలయాల్లో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో సంప్రదాయాలను తూతూమంత్రంగా పాటించడం వంటివి హిందూ సమాజంలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఆయనపై ద్వేషం పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది.
అతి తెలివి.. ఆత్మరక్షణ?
జగన్ అవలంబిస్తున్న ఈ విధానం అతి తెలివి’ కిందకే వస్తుంది. క్రైస్తవుల మద్దతు ఎలాగో తనకే ఉంటుందన్న ధీమా, హిందువులను మభ్యపెట్టవచ్చన్న ఆశ.. ఈ రెండింటి మధ్య ఆయన తన అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. రాజకీయం కోసం మతాన్ని ఒక వాడుకుని వదిలేసే వస్తువులా చూడటం వల్లే ఇన్ని విమర్శలు వస్తున్నాయి. తన మతంపై తనకు లేని గౌరవం, ప్రజల్లో ఎలా కలుగుతుందనేది ప్రాథమిక ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఏ మతస్థుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ, తాను కాని దానిని అని చెప్పుకోవడం లేదా తనది కాని దాన్ని తనదిగా నటించడం రాజకీయ అనైతికత అనిపించుకుంటుంది. జగన్ తన మతాన్ని ఒప్పుకోలేకపోవడం వెనుక ఉన్నది భయం కాదు, ఒక రకమైన అవకాశవాదం. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న స్పృహ లేకపోవడమే ఇక్కడ అతిపెద్ద లోపం. ఈ దాగుడుమూతల రాజకీయం ఆయన వ్యక్తిత్వానికి, రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
