హీరో అనే పదానికి పర్యాయపదం
డాన్స్‌కి డిక్షనరీ
స్టార్ డమ్‌కి కేరాఫ్ అడ్రస్స్
రికార్డుల మొనగాడు.. బాక్సాఫీస్ రారాజు
-ఎన్ని ఉపమానాలు ఇచ్చినా, ఇంకెన్ని కొత్తగా పుట్టుకొచ్చినా అవన్నీ చిరంజీవి సొంతం!
మెగాస్టార్ అంటే ఏమిటో తెలుగు సినిమా తెర కథలు కథలుగా చెబుతుంది.
ఆ క్రేజ్ ఎంతో టికెట్ కౌంటర్ల ముందు నిలబడ్డ క్యూలు చెబుతాయ్..
ఆ చరిష్మా ఎందుకో బద్దలైపోయిన రికార్డులు చెబుతాయ్..
చిరు గురించి మాట్లాడుకోవడానికి ఉపమానాలు వెదుక్కోవాల్సిన పనిలేదు. పదాలు కూడబలుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన టైటిల్సే.. ఆయనంటే ఏమిటో చెప్పేస్తాయ్.. చిరంజీవి అనే పదానికి నిర్వచనంలా నిలబడతాయ్..
ఖైదీ: అభిమానుల గుండెల్లో ఎప్పటికీ!
స్వయంకృషి: అసలు ఈ పదానికి పేటెంట్ చిరు దగ్గరే ఉందేమో? కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. చిరంజీవిగా మారడం వెనుక, మెగాస్టార్ గా వెలగడం వెనుక ఉన్న కృషి, పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో వ్యక్తిత్వ వికాస పాఠం.
గ్యాంగ్ లీడర్: ఒకరా, ఇద్దరా ఆ ఇంటి నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. చిరంజీవిని చూసి ఎంతోమంది హీరోలుగా మారారు.. మారుతున్నారు. వాళ్లెంత స్థాయికి వెళ్లినా.. వాళ్లందరికీ చిరునే లీడర్… గ్యాంగ్ లీడర్.
వేట: చిరు వేట.. ఎప్పుడూ రికార్డుల కోసమే. తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకొని బాక్సాఫీసు చరిత్రని తిరగరాయడం, ఆల్ టైమ్ హిట్స్ కొట్టడంలో చిరుకి చిరునే సాటి.
బిగ్ బాస్: తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు.. బాస్.. బిగ్ బాస్ ఆయనే. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఆయన ఇంటి ముందు వాలుతుంది. ఆయన కూడా ఆ పెద్దరికం తీసుకొని మరీ.. సమస్యని చక్కబెడుతుంటారు. అందుకే చిరు అంటేనే బిగ్ బాస్.
విజేత: చిరంజీవి అడుగుపెట్టేటప్పుడు ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు ఏఎన్నార్. కృష్ణ.. శోభన్ బాబు, కృష్ఱంరాజు.. ఇలా బోలెడంత పోటీ. వాళ్లందర్నీ తట్టుకొని, దాటుకొని, తనదంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకొన్న అసలు సిసలైన విజేత.. చిరంజీవి.
ఆపద్భాంధవుడు: పరిశ్రమలో చిరంజీవి సహాయం పొందని వ్యక్తి లేడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా గుర్తొచ్చే తొలి పేరు చిరంజీవినే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది జీవితాల్ని నిలబెట్టింది. కరోనా సమయంలో.. చిరు చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది.
ముఠామేస్త్రీ: కష్టజీవులకు అండగా ఉండడం చిరుకి ముందు నుంచీ ఉన్న అలవాటే. ఆయన కార్మికుల పక్షం. కార్మికుల వేతనాల పెంపుని కోరుతూ, సమ్మె ప్రకటించినప్పుడు మధ్యవర్తిత్వం వహించి.. ఓ పరిష్కార మార్గం చూపించారు.
అందరివాడు: చిరుని ఒక్క వర్గానికే పరిమితం చేయలేం. ఆయన అందరి వాడు… అందరికీ కావాల్సిన వాడు. దర్శకులు, నిర్మాతలు, కార్మికులు.. ఇలా అందర్నీ కలుపుకొని వెళ్లడం చిరుకి ముందు నుంచీ అలవాటే. ఇండస్ట్రీలో ఎన్ని కాంపౌండ్ లు ఉన్నా, వాటిని దాటుకొచ్చే అభిమానం చిరుకి మాత్రమే సొంతం.
గాడ్ ఫాదర్: చిరు హీరో అవ్వాలనుకొన్నప్పుడు ఆయన వెనుక ఎవరూ లేరు. కానీ ఇప్పుడు చాలామంది హీరోల వెనుక చిరంజీవి అనే స్ఫూర్తి వుంది. ఇండస్ట్రీకి ఏ కొత్త హీరో వచ్చినా ‘నాకు చిరునే ఆదర్శం’ అనడం, అది వినడం.. చాలా అలవాటుగా మారిపోయిన విషయం. ఎన్ని తరాలు వచ్చినా వాళ్లందరికీ రోల్ మోడల్ అవ్వదగిన కటౌట్ ఆయనది.
ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోయే చోట… ఏళ్లు దాటినా, దశాబ్దలు మారినా ‘మెగాస్టార్’పై మక్కువ మాత్రం తగ్గలేదంటే అది మామూలు విషయం కాదు. తరాలు గడుస్తున్నా, కొత్త నీరు ప్రవహిస్తున్నా, అభిరుచులు మారుతున్నా.. చిరంజీవి అనే పేరు.. ఇంకా ఇంకా ప్రభంజనంలా వెలుగుతోంది. ఇదంతా చిరు పడిన కష్టం.. ఎదిగిన వైనం. తానొక్కడే ఎదగడం కాదు. తన స్వయం కృషితో ఏకంగా ఓ సామ్రాజ్యాన్నే నిర్మించుకొన్నారు. అందుకే మెగాస్టార్ అయ్యారు.
ఈ పుట్టిన రోజు ఆయనకు మరిన్ని శుభాలు కలిగించాలి.
ఈ ప్రయాణం మరింతమందకి ఆదర్శం కావాలి.
హ్యాపీ బర్త్ డే టూ అవర్ ఓన్ మెగాస్టార్!!!