చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాకి టైటిల్ లాక్ అయ్యింది. ముందునుంచి ప్రచారంలో వున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక కూడా వుంది. చిరు కెరీర్లో పొడవాటి టైటిల్స్ తక్కువ. జగదేక వీరుడు అతిలోక సుందరి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.. లాంటి టైటిల్స్ తర్వాత అంత లెంగ్త్ వున్న టైటిల్ బహుశా ఇదే కావచ్చు.
టైటిల్ గ్లింప్స్ కూడా వదిలారు. 156 చిత్రాలు చేసిన చిరంజీవి కొత్తగా ప్రెజెంట్ చేయడం అంటే కష్టం. అయితే దీనికి ఒక సులభమైన మార్గం వుంది. ఆయన వింటేజ్ ఛరిస్మాని చూపిస్తూ ఒక రీల్ కట్ చేస్తే సరిపోతుంది. అనిల్ రావిపూడి అదే చేశాడు. బీజీఎంలతో సహా మెగాస్టార్ వింటేజ్ సిగ్నేచర్ స్టయిల్స్‌ని మ్యాక్సిమమ్ వాడేశాడు. వీడియోలో డైలాగులు లేవు కానీ మెగా గ్రేస్ వుంది. కొండవీటి దొంగలో సిగ్నేచర్ గుర్రం పోజ్ అయితే ఒక్కసారి ఆ కాలంలోకి తీసుకెళ్లిపోయింది. గ్లింప్స్‌లో ఆయన గెటప్ చూస్తే ఏదో సెక్యూరిటీ ఏజెన్సీకి బాస్‌లా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ వీడియోకి ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో సర్ప్రైజ్. అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్‌ని పట్టేసిన దర్శకుడు. సరదాగా నవ్వుకునే సినిమా తీయడంలో ఆరితేరిపోయాడు. సంక్రాంతి సీజన్లో అలాంటి సినిమాలకి ఎంత గిరాకీ వుంటుందో ‘సంక్రాంతి వస్తున్నాం’ రుజువు చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్ శంకరవరప్రసాద్ రిపీట్ చేస్తే మెగా ఫ్యాన్స్‌కి అంతకంటే ఏం కావాలి.