సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయి. కానీ పాటకు ఉంటాయా? ఉంటే ఎలా ఉంటుందో.. చూపించారు గీత రచయిత చంద్రబోస్. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో `నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకొన్నా అనే పాట రాశారు చంద్రబోస్. సిద్ద్ శ్రీరామ్ గాత్రదానంలో… అనూప్ స్వరకల్పనలో రూపొందిచన ఈ పాట సూపర్ హిట్. ’30 రోజుల్లో..’ చిత్రానికి ఈ పాట వల్లే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ పాట జనాల్ని థియేటర్లకు రప్పించగలదని ఈ పాట నిరూపించింది.
ఇప్పుడు ఈ పాటకు సీక్వెల్ చేశారు. మున్నా దర్శకత్వంలో ‘బ్యాడ్ గాళ్స్’ అనే ఓ సినిమా రూపుదిద్దుకొంది. ’30 రోజుల్లో..’ చిత్రానికి ఈయనే దర్శకుడు. చంద్రబోస్, అనూప్, సిద్ద్ శ్రీరామ్ ఈ ముగ్గురూ కలిసి ఈ పాట కోసం పని చేశారు. ‘నీలి.. నీలి’ ట్యూన్లోనే ఈ పాట కూడా సాగుతుంది. ఓ అమ్మాయికి అబ్బాయి భరోసా ఇస్తూ పాడిన పాట ఇది. పాటలో సాహిత్యం.. అద్భుతంగా కుదిరింది. చంద్రబోస్ రాసిన పోలికలు… ఉపమానాలు.. భలే కుదిరాయి.
”సూర్యుడినే బతిమాలి రావద్దంటానే
నీకు నిద్దర సరిపోకుంటే…
సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తా
నువ్వు స్నానం చేస్తానంటే
మట్టినంతా పూలగుట్టగా మార్చివేస్తానే
నువ్వు నేలపైన నడిచెళితే..
మబ్బు తెరల పందిరేసి నీడ తెస్తానే
నువ్వు ఎండలోకి వెళుతుంటే..” అంటూ మొదలైన పాట.. ప్రతీ పదంలోనూ, చరణంలోనూ ప్రేమని పొంగించింది.
చరణం ఇంకా బాగా కుదిరింది.
”గాజులనే కోరుకుంటా
గట్టిగా నీ చేయి తాక వద్దని
వాలు జడను వేడుకొంటా
నీ వీపుని వేధించవద్దని
పట్టీలను ప్రార్థిస్తుంటా
పట్టీ పట్టి నొక్కవద్దనీ
గొలుసుతోటి గొడవేస్కుంటా
ఒరుసుకొంటే నేనూరుకోనని”
– ఇలా చంద్రబోస్ ప్రవాహం సాగిపోయింది. ట్యూన్ పాతదే అయినా… ఈ పాటలో కొత్తగా వినిపించింది. సిద్ద్ శ్రీరామ్ గానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో తన నుంచి వచ్చిన మంచి పాట ఇది. కొన్నాళ్ల పాటు అబ్బాయిలూ, అమ్మాయిలు పాడుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి తగినంత కంటెంట్ ఈ పాట ఇచ్చేసింది.