హనుమాన్ తో పాన్ ఇండియా విజయం సాధించాడు తేజ సజ్జ. ఇప్పుడు మిరాయ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది. ట్రైలర్ కట్ కూడా బాగుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో తేజ సజ్జా మాట్లాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఈవెంట్ లో ఫ్యాన్స్ ని తనని ‘పాన్ ఇండియా హీరో’ అని పిలిచారు. ఈ పిలుపుని తేజ అంగీకరించలేదు. ”నేను పాన్ ఇండియా హీరో కాదు. మన తెలుగు ఆడియన్స్ కోసం నటిస్తున్నాను. నా సినిమా మిగతా భాషల వారికి నచ్చితే అది బోనస్ అంతే. నేను మాత్రం తెలుగు కోసమే వర్క్ చేస్తున్నాను. మీ దగ్గరే ప్రెస్మీట్లు చేసుకుంటాను. ఇక్కడే వుంటాను’ అని చెప్పాడు.
బేసిక్ గా పాన్ ఇండియా హీరో అని పిలవాలనే ఉబలాటం హీరోలకి ఉంటుంది. తేజ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. బహుశా తేజ ఈ ఇమేజ్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడని భావించాలి. తేజకి ఇప్పటివరకు వచ్చింది ఒక్క పాన్ ఇండియా విజయమే. అందులోనూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫాక్టర్ ఎక్కువ వుందని విశ్లేషిస్తుంటారు. మిరాయ్ తో మరో హిట్ కొడితే అప్పుడు పాన్ ఇండియా హీరో అని పిలవడం సబబుగా ఉంటుంది. అందుకే తేజ కావాలనే పాన్ ఇండియా హీరో ట్యాగ్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడని భావించాలి.