తేజా సజ్జా – ‘మిరాయ్’ ట్రైలర్ ఆసక్తిని పెంచింది. మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా కుదిరాయి. సినిమా చూడాలన్న ఉత్సాహం కలిగింది. కచ్చితంగా ఈ ట్రైలర్ తో మిరాయ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘మిరాయ్’లో ‘వైబ్ ఉంది పిల్లా..’ అనే పాట ఒకటి విడుదల చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. మరో పాట కూడా ఈ సినిమాలో ఉంది. అది త్వరలో విడుదల చేస్తారు. ఈ సినిమాలో పాటలకు ఛాన్స్ తక్కువ. ఉన్న ఈ కొద్ది పాటల్ని కూడా ఎక్కడ ప్లేస్ చేయాలా? అనే టెన్షన్లో ఉంది చిత్రబృందం.
వైబ్ ఉంది పిల్లా పాట ఆడియో పరంగా పెద్ద హిట్. అయితే ఈ పాట థియేటర్లో ఉంటుందా, లేదా? అనేది అనుమానమే. కథకు అడ్డొస్తుందన్న ఫీలింగ్ వస్తే, ఈ పాటని లేపేసి.. చివర్లో ఎండ్ టైటిల్స్ లో వేద్దామన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఒకవేళ పాట లేకపోతే.. ఆడియన్స్ నిరుత్సాహ పడతారేమో అనే సందిగ్థం కూడా ఉంది. ఒకటి మాత్రం నిజం.. ఆల్బమ్ లో ఉన్న పాటలన్నీ థియేటర్లో ఉండకపోవొచ్చు. ఒకటి కచ్చితంగా మిస్ అవుతుంది. అది వైబ్ ఉందే పిల్లా పాట.. లేదంటే కొత్తగా విడుదల కాబోయే మరో పాటా? అనేది తేలాల్సివుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన సినిమాని చాలా షార్ప్ గా కట్ చేయాలని చూస్తారు. ఆయన చేతిల్లో సినిమా పెట్టామంటే.. ఎడిట్ వెర్షన్ పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏ పాట ఉండాలి? అనేది కూడా ఆయన నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది.
గేమ్ ఛేంజర్, కింగ్ డమ్ ఆల్బమ్స్ లో హిట్టయిన పాటలు… థియేట్రికల్ వెర్షన్స్ లో లేవు. ఆ పాటలు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. ఇప్పుడు ‘మిరాయ్’ తో ఏం జరుగుతుందో?
