తెలంగాణలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సమస్య అని సీఎం రేనంత్ రెడ్డి మనుషులు అడగడానికి వెళ్తే .. ఎన్నికల్లో ఖర్చయిన మొత్తం రాబట్టుకోవాలిగా.. ఓ పాతిక కోట్లు పంపించండి అని అడిగారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి సిబ్బంది..ఎమ్మెల్యేకు ఓ మాట చెప్పమన్నారట .. ఈ రెండు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన కొత్తపలుకులో వెల్లడించిన ఘటనలు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో కానీ… వారిని ఉదాహరణగా మాత్రమే తీసుకున్నారు. చాలా మంది అలాగే ఉన్నారు కాబట్టి… వారి పేర్లు బయట పెట్టలేదన్నట్లుగా రాసుకొచ్చారు.
అధికారపార్టీల్లో ఉన్న వారు ఇష్టం వచ్చినట్లుగా దోచుకోవచ్చని అనుకుంటున్నారని.. దానికి కేసీఆర్, జగనే కారణమని ఆయన తేల్చేశారు. వారు ఉన్నప్పుడే ఎమ్మెల్యేలకు సంపూర్ణ అవకాశం ఇచ్చారని అంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని వారిని కట్టడి చేయాల్సిందేనని ఆర్కే హెచ్చరిక. తెలంగాణలో రేవంత్ తో పోలిస్తే.. చంద్రబాబుకు తిరుగులేనంత మెజార్టీ ఉంది. అలాంటప్పుడు దారి తప్పిన కొంత మందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆర్కే వాదన.
ఓ పాతిక మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా తప్పేమిటని సలహా ఇస్తున్నారు. అధికారం చూసుకునే వారు రెచ్చిపోతున్నారు కాబట్టి కనీసం ఆ అధికారాలను అయినా కట్ చేయాలని సలహాలు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలను పట్టించుకోవడంలేదని మానేయాలని అధికారవర్గాలకు చెప్పాలంటున్నారు. ప్రజా ప్రతినిధుల్ని పట్టించుకోవద్దని ఓ సీఎం చెబితే అది ఎంత ప్రమాదకర సంకేతంగా మారుతుందో.. ఆర్కే ఆలోచించలేదు. ఎమ్మెల్యేలు అంటే దోచుకునేవారే వారేనన్నట్లుగా ముద్ర వేసే ప్రయత్నం ఈ వారం కొత్తపలుకులో బలంగా జరిగింది.
ఆంధ్రజ్యోతి నేరుగా పేర్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలపై కథనాలు రాయవచ్చు. స్పష్టంగా జరిగిన ఘటనల గురించి చెబితే ఆ ఎమ్మెల్యేల గురించి ప్రజలకు తెలుస్తుంది. ఆ భయంతో ఎమ్మెల్యేలూ అలర్ట్ అవుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అంతా సంపాదించుకోవడం అనే కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ వారి ఖర్చు అత్యధికం పార్టీలే పెట్టుకుంటున్నాయని కూడా చెబుతున్నారు.
మొత్తంగా ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగిపోతున్నాయని.. తన దృష్టికి వచ్చిన…ఒకటి, రెండు ఘటనలతోనేతేల్చేశారు ఆర్కే. చర్యలకూ సలహాలిచ్చారు. ప్రజలు గాలి పీల్చాలన్నా తమ అనుమతి తీసుకోవాలన్నట్లుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్న ముద్ర వేసేశారు. ఇక తుడుచుకోవాల్సింది.. జాగ్ర్తతపడాల్సింది ఎమ్మెల్యేలే.