ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలోజగన్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇండీ కూటమి అభ్యర్థిని ప్రకటించక ముందే తమ మద్దతు ఎన్డీఏకేనని సమాచారం ఇచ్చారు. అయినా ఇప్పుడు ఇండీ కూటమి అభ్యర్థితో మంతనాలు జరుపుతున్నారు. జగన్ మద్దతు కోరుతూ ఇండీ కూటమి అభ్యర్థి ఫోన్ చేశారని వైసీపీ ప్రకటించింది. అయితే మీరు ఆలస్యం చేశారని ముందే తాము కమిట్ అయ్యామని అన్యధా భావించవవద్దని జగన్ విజ్ఞప్తి చేశారని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన తర్వాత ఇలా.. ఇతర పార్టీల వాళ్లు మద్దతు అడగడానికి కూడా అవకాశం కల్పించరు. కానీ జగన్ దానికి భిన్నంగా వెళ్లారు.
కాంగ్రెస్ అభ్యర్థిని అన్యథా భావించవద్దని వేడుకున్న జగన్
తెలుగు సెంటిమెంట్ పక్కన పడితే.. సామాజికవర్గ సెంటిమెంట్ కూడా జగన్ కు సమస్యగా మారింది. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరికి మద్దతిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ సొంత సామాజికవర్గం అభ్యర్థి నిలబెట్టినా మద్దతివ్వరా అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికిన బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తున్నారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కానీ వైసీపీ వర్గాల నుంచి స్పందన లేదు. వైసీపీ ఓట్లు లేకపోయినా బీజేపీకి ఎలాంటి నష్టం జరగదు. అయినప్పటికీ జగన్ మాత్రం బీజేపీకే మద్దతు ప్రకటించారు. అసలు తాము వైసీపీని మద్దతు అడిగామని బీజేపీ నేతలు ఇంత వరకూ ఒక్క ప్రకటన చేయలేదు. కానీ వైసీపీ నేతలే.. రాజ్ నాథ్ అడిగారని.. తాము మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చారు.
టీడీపీ, జనసేన కూటమికి మద్దతివ్వడం ఎలాంటి రాజకీయం ?
టీడీపీ, జనసేన ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అంటే జగన్ రెడ్డి రాజకీయానికి కనీస విలువల్లేవని అర్థం. ఆయన బీజేపీకి మద్దతుగా ఉంటున్నారని ఆయన ఓటు బ్యాంకులో గగ్గోలు రేగుతున్నా ఆయన పట్టించుకోవడంలేదు. తన కేసులు, చేసిన అక్రమాలు, దోచుకున్న దోపిడీకి రక్షణ కావాలంటే బీజేపీని పట్టుకుని ఉండాల్సిందేనని ఆయన అనుకుంటున్నారు. అందుకే బీజేపీని వదల్లేకపోతున్నారు. కానీ రేపటికి తన దగ్గర ఈ బలం కూడా ఉండదు. అప్పుడు బీజేపీ పట్టించుకోదు. అందుకే కాంగ్రెస్ నూ కాకా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన పరిస్థితి అర్థం చేసుకోవాలని.. ఇవాళ కాకపోతే రేపు అయినా మీతో వచ్చి చేరుతానని సంకేతాలిస్తున్నారు.
విసిగిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలతో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా విసిగిపోయే పరిస్థితి ఉంది. కనీస విశ్వసనీయత కాపాడుకోలేని రాజకీయాలతో సాధించేదేమిటన్న ప్రశ్న అందరికీ వస్తోంది. ఏపీలో అధికార పార్టీ కూటమికి ఢిల్లీలో మద్దతివ్వడం కన్నా ఆత్మహత్యా సదృశం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. కానీ తాను జైలుకెళ్లకుండా ఉండటమే జగన్ కు అత్యవసరం మరి.