ఈ సారి హైడ్రోజన్ బాంబు వేస్తా అని రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తున్నారు. ఆయన గతంలో వేసిన అణుబాంబు పెద్దగా పేలకపోవడంతో ఈ బెదిరింపులకు పెద్దగా విలువ లేకుండా పోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం హైడ్రోజన్ బాంబు గురించి భారీగా ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ హైడ్రోజన్ బాంబుతో మొత్తం ఈసీ విశ్వసనీయత తగలబడిపోతుందని అంటున్నారు. ఎప్పుడు ఈ బాంబు వేస్తారో తెలియదు కానీ.. గతంలోలా ఓటర్ జాబితాలోని లోపాల్నే చూపిస్తే.. అందరూ వింతగా చూసే అవకాశం ఉంది.
ఓట్ల చోరీ నిజమైతే రాజకీయం కన్నా నిరూపించడం ముఖ్యం!
ఓట్ల చోరీ అంటే కొంత మంది ఓట్లను తీసేయడం కావొచ్చు. మరికొంత మంది దొంగ ఓట్లను కలిపి..తమకు ఓట్లు వేయించుకోవడం అనుకోవచ్చు. ఇలాగే చేసి ఉంటే ఖచ్చితంగా నిరూపించాల్సి ఉంది. ఓట్ల జాబితాలో లోపాలు దీన్ని నిరూపించలేవు. బెంగళూరు లాంటి మహా నగరంలో ఓటర్లు ఉన్న చోట లేరని ఒకే ఇంట్లో వంద ఓట్లు ఉన్నాయని చెప్పడం పెద్ద విషయంకాదు. చిన్న చిన్న నగరాల్లోనూ ఇలాంటి లోపాలు ఉంటాయి. ఇలాంటివి సరి చేయడానికే పార్టీలకూ ఓటర్ల జాబితాలు ఇస్తారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఇస్తారు. అక్కడ నిరూపించకుండా రాజకీయం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది ? పైగా నిజమైతే ఎఫెక్ట్ తగ్గిపోతుంది.
బీహార్లో తొలగించిన 65 లక్షల ఓట్లపై ఏం తేల్చారు ?
బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రచ్చ రచ్చచేశారు. సుప్రీంకోర్టు తొలగించిన ఓట్ల జాబితాను కారణాలతో సహా వెల్లడించాలని ఆదేశించింది. ఈసీ అదే పని చేసింది. చాలా రోజులు అయింది. ఆ అరవై ఐదు లక్షల ఓటర్లలో ఎన్ని ఓట్ల చోరీ జరిగిందో… ఎంత మంది అర్హులైన ఓట్లు తొలగించారో.. ఎంత మంది ఫేక్ ఓట్లు చేర్చారో బయట పెట్టాల్సింది. ఆ పని ఇప్పటి వరకూ చేయలేదు. ఎంత చేసినా.. ఎన్నో కొన్ని లోపాయింటాయి. వాటిని అయినా బయట పెట్టలేకపోతున్నారు.
ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దాడి ఘోర తప్పిదం !
ఎన్నికల సంఘం పనితీరును విమర్శింవచ్చు. వారి నిర్ణయాలను ఆక్షేపించవచ్చు కానీ.. మొత్తం ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు వేస్తామని.. అర్థసత్యాలతో ప్రచారాలు చేస్తామని బయలుదేరిదే రాజకీయంగా పెను తప్పిదం అవుతుంది. ఇప్పటికే బీహార్ లో రాజకీయంగా దారి తప్పారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గెలవాల్సిన చోట.. అవసరం లేని విషయాలపై రాజకీయం చేస్తూ.. బీజేపీ కూటమి నెత్తిన పాలు పోస్తున్నారని అంటున్నారు. మరి హైడ్రోజన్ బాంబు తర్వాత ఏమవుతుందో ?
