ప్రతి రాజకీయ పార్టీ అవకాశవాదంతో ఉంటుంది. కానీ ఆ అవకాశవాదాన్ని మించి.. తమకంటూ ఓ “సోల్” ఉంటుందని…దాన్ని కాపాడుకోవాలన్న స్పృహ ఉండాలి. ఆ సోల్ మాత్రమే.. ఆ రాజకీయ పార్టీ ఉనికిని కాపాడుతుంది. ఓటు బ్యాంకుని నిర్దిష్టంగా ఉంచుతుంది. చివరికి ఆ సోల్ ను కూడా తాకట్టు పెట్టి వైసీపీ రాజకీయాలు చేస్తుంది. జగన్ రెడ్డి. దీని వల్ల వ్యక్తిగతంగా లాభపడతారేమో కానీ… వైసీపీ పార్టీ ఆ సోల్ ను కోల్పోయి నిర్వీర్యం అయిపోతుంది. ఆ విషయం జగన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదని అనుకోలేం.
క్యాడర్ ప్రశ్నలకు జగన్ రెడ్డి ఏం చెబుతారు ?
జై ఎన్డీఏ అని అరుస్తూ.. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైసీపీ ఓటువేసింది. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై రైతు పోరు అనే కార్యక్రమం చేపట్టింది. ఎలా జరిగింది అన్న అంశం పక్కన పెడితే .. ఇలా ఎలా అన్న అని క్యాడర్ జగన్ ను ప్రశ్నించింది. ఉండవల్లి లాంటి వాళ్లు మొహానే అడిగారు. వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్ రెడ్డికి ఉంది. పార్టీ కి ఆయన అధ్యక్షుడు అయినంత మాత్రాన.. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోలేదు. క్యాడర్ ను పరిగణనలోకి తీసుకోలేదు. తనకు మోకాళ్లపై వంగి దండాలు పెట్టడమే క్యాడర్ పని అనుకుంటే జగన్ రెడ్డి కన్నా అహంకారి ఇంకెవరు ఉండరు.
నమ్ముకున్న ఓటు బ్యాంకుకు ఏం చెబుతారు ?
జగన్ రెడ్డి తనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు అసలు ఓటు బ్యాంక్ లేదు. ఉన్నదల్లా.. ఎన్డీఏ వ్యతిరేకతకు. చంద్రబాబు, ఆయన కూటమి అంటే ఇష్టం లేని వాళ్లు జగన్ కు ఓటు వేశారు. మరి వారి అభిప్రాయాలను జగన్ ఎందుకు గౌరవించడం లేదు. జగన్ రెడ్డికి ఓట్లు వేసిన వారిలో అత్యధికం ముస్లింలు, దళితలు. వారు సంప్రదాయంగా బీజేపీని వ్యతిరేకిస్తారు. కానీ వారి ఓట్లు పొందిన జగన్ రెడ్డి చేసిందేమిటి ?. ఎంపీలకు కాషాయ వస్త్రాలు వేసి మరీ బీజేపీకి మద్దతు పలికారు . ఇది తనను నమ్ముకున్న ఓట్లను బీజేపీకి అమ్మేయడం లాంటిదే. వారిని అడ్డగోలుగా మోసం చేయడమే. దీనికి ఆయన ఏం చెబుతారు ?
ఎంత కాలం ఇలా అధికారంలో ఉన్న వారిని జోకి జైలుకెళ్లకుండా ఉంటారు ?
జగన్ రెడ్డికి బీజేపీ మీద అభిమానం లేదు. కానీ భయం ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తే తనను శంకరగిరి మాన్యాలకు పట్టిస్తారని భయం. తాను చేసిన నేరాలు, ఘోరాలకు ఎంత కాలం జైల్లో ఉన్నా శిక్షలు సరిపోవని ఆయనకు తెలుసు. అందుకే ప్రజలు ఇచ్చే బలంతో.. అధికారంలో ఉన్న పార్టీలకు ఊడిగం చేసి.. తన వ్యక్తిగత ప్రయోజనాు నెరవేర్చుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… ఆయన నిర్మోహమాటంగా.. రాహుల్ కే ప్రజామోదం ఉందని తాము కాంగ్రెస్ వైపే ఉంటామని ప్రకటిస్తారు. జగన్ రెడ్డికి కావాల్సింది తన నేరాల నుంచి రక్షణ. అందు కోసం ఆయన తనను నమ్మిన ఓటర్లను వంచిస్తున్నారు. వారు కూడా నిజం తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో జగన్ ఓటర్లకు చైతన్యం వచ్చిన రోజున ఆయన పులివెందులలోనూ గెలవలేరు. దానికి సాక్ష్యం.. ఇటీవలి జడ్పీటీసీ ఎన్నికలే.
