మళ్లీ జగన్ రెడ్డి సీఎం అయితే అమరావతి నుంచి పరిపాలిస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మీడియా కాంక్లేవ్‌లో చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని చెప్పలేదన్నారు. ఆయన చెప్పిన మాటల్ని విన్న వారికి పాపం వైసీపీ అనిపిస్తుంది. ఆ పార్టీ క్యాడర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. లీడర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇదే మాట జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. అమరావతిపై తన విధానాన్ని చెప్పి ఉంటే బాగుండేది. కానీ సజ్జలతో చెప్పించారు. దానికి ఎంత విలువ ఉందన్నది పక్కన పెడితే.. అసలు అమరావతి రాజధాని అన్న అంశంపై చర్చ ఎప్పుడో ముగిసిపోయింది.
రాజధాని చర్చే అసంబద్దం
అమరావతి ఏపీ రాజధాని అనేది ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయం. అందులో జగన్ రెడ్డికూడా ఉన్నారు. ఆమోదిస్తున్నా అన్నారు. 30వేల ఎకరాల్లో కట్టాలి అన్నారు. ఆయన మాటల ప్రకారమే…అమరావతిలో రాజధాని నిర్ణయం అయింది. పునాదులు పడిన తర్వాత వచ్చిన ఆయనే.. దాన్ని చంపేసే ప్రయత్నం చేశాడు. కానీ విజయవంతం కాలేదు. అక్కడే రాజధాని పునాదుల్లో ఎంత బలం ఉందో తేలిపోయింది. ప్రజలు జగన్ రెడ్డికి భయంకర శిక్ష వేశారు. ఇక అమరావతిపై చర్చే అసంబద్ధం.
అమరావతిని మార్చడం ఇక ఎవరి తరం కాదు !
అమరావతిలో కట్టకూడదు.. విజయవాడ, గుంటూరు మధ్య కట్టాలి అని కొత్తగా ఏదో చెబుతున్నారు వైసీపీ నేతలు. అసలు అమరావతి అంటే ఏంటో తెలిస్తే ఇలా మాట్లాడరు. కానీ ప్రజల్ని మభ్యపెట్టి.. ఏదో తప్పుడు ప్రచారం చేసి.. తమదైన కుళ్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్లకు తెలిసినా తెలియనట్లుగా ఉండే విషయం ఏమిటంటే.. అసలు రాజధానిగా అమరావతిని మార్చడం ఎవరి తరం కాదు. వారు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అదే నిజం. కానీ తాము వస్తే.. అదే కొనసాగిస్తామని చెప్పడం.. కేవలం అమరాతిపై చర్చను కొనసాగించడానికే.
వైసీపీ, సజ్జల అమరావతిపై కుట్రలు ఆపరు !
సజ్జల అలా చెప్పాడని.. అమరావతిపై చర్చ పెట్టడం కూడా పొరపాటే అవుతుంది. అమరావతిలో ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా కలిస్తే.. వచ్చే రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతుంది. అమరావతి పునాదులు ఎంతో బలంగా ఉన్నాయి కాబట్టే.. రాక్షస మూకలు దాడి చేసినా చెక్కు చెదరలేదు. కాలకేయులంతా కలసి వచ్చినా.. అమరావతిని ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరు. ఇది ప్రజాశాసనం కాబట్టి.. చర్చ కూడా అనవసరం.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                