ఏపీలో 16,347 మంది కొత్త టీచర్లు వచ్చారు. మెగా డీఎస్సీ-2025 కోసం పూర్తి మెరిట్ లిస్టును అధికారికంగా విడుదల చేశారు. వీరందరూ ఇక ఉద్యోగాల్లో చేరనున్నారు. వచ్చే నెల నుంచి వీరంతా ప్రభుత్వ టీచర్లు. విద్యా మంత్రిగా నారా లోకేష్ మెగా డీఎస్సీ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తూ చిన్న పొరపాట్లు కూడా లేకుండా ప్రక్రియను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాజీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తమకు తెలియదని .. ఎలా భర్తీ చేస్తారని అమాయకంగా ప్రశ్నించారు. ఎందుకంటే .. జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి మెగా డీఎస్సీ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే టీచర్లను నియమిస్తామన్నారు. కానీ ఐదు సంవత్సరాల్లో మెగా డీఎస్సీ కాదు కదా.. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. టీచర్లను రాచి రంపాన పెట్టారు. అసలు టీచర్ పోస్టుల్లో ఖాళీలే లేవన్నారు.
అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్.. విద్యాశాఖాధి మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ నిర్వహించారు. వీటిని ఆపేందుకు వైసీపీ తరపున పదుల కొద్దీ పిటిషన్లు కోర్టుల్లో వేయించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ ఒక్క చోట కూడా ప్రక్రియను ఆపలేకపోయారు. వైసీపీ వేసే పిటిషన్లు.. వాటికి కౌంటర్ ఇచ్చే విషయంలో సమర్థమైన న్యాయ బృందాన్ని నారా లోకేష్ ఎంగేజ్ చేశారు. ఫలితంగా న్యాయపరంగా ఎలాంటి సమస్యలు కూడా రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి అయింది.
ఉద్యోగాలను భర్తీ చేయడం కాదు.. నిజమైన ప్రతిభావంతులకే అవకాశం లభించేలా పక్కాగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. నారాలోకేష్ ఈ విషయంలో తనదైన ప్రత్యేకత చూపారు. ఉద్యోగ భర్తీ ఎంత పకడ్బందీగా ఉండాలో చూపించారు. పరీక్ష జరిగిన విధానం..ఫలితాలపై చిన్న ఆరోపణ కూడా లేకపోవడం లోకేష్ తీసుకున్న జాగ్రత్తగా నిదర్శనం.
